
మేడారంలో భక్తుల సందడి
సమ్మక్కకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
● వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో మేడారంలో జాతర కళ సంతరించుకుంది. మేడారానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల వద్ద భక్తులు స్నానాలు ఆచరించి వనదేవతల గద్దెల వద్దకు చేరుకున్నారు. చీరసారె, పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలను, కోళ్లను, మేకలను అమ్మవార్లకు మొక్కుగా చెల్లించారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ మధు, బాలకృష్ణలు భక్తులకు సేవలందించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గద్దెల ప్రాంగణంలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేసి సందడి చేశారు.
అమ్మవార్లకు బంగారం బాసింగాలు
హైదరాబాద్‌లోని అబిడ్స్‌కు చెందిన వెంకటేశ్ కుమార్తె ప్రియాంకకు వివాహం జరగడంతో అమ్మవార్లకు బంగారం బాసింగాలు కానుకగా సమర్పిస్తామని మొక్కుకున్నారు. ప్రియాంక యూఎస్‌లో ఉండడంతో ఆమె తల్లిదండ్రులు 2.5 గ్రాముల బంగారం బాసింగాలను తయారీ చేయించి అమ్మవార్ల హుండీలో కానుకగా సమర్పించినట్లు వారు తెలిపారు. అమ్మవార్లకు ఒడిబియ్యం, చీరసారె, ఎత్తు బంగారం సైతం సమర్పించినట్లు వెల్లడించారు.

మేడారంలో భక్తుల సందడి

మేడారంలో భక్తుల సందడి