
అభివృద్ధి పనులకు అటవీశాఖ సహకరించాలి
ములుగు: అభివృద్ధి కార్యక్రమాలకు అటవీశాఖ అడ్డుతగలకుండా సహకరించాలని మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణతో కలిసి అన్నారు. ఈ మేరకు శనివారం అటవీ శాఖ సమస్యలు, పర్యావరణం అడవులు, శాస్త్ర సాంకేతిక విధానం విభాగంపై ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఆర్‌అండ్‌బీ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అటవీ అభయారణ్య చట్టాల కారణంగా ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ రోడ్లు సైతం మంజురు కావడం లేదన్నారు. రహదారి సదుపాయం లేక ఆయా ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అడిగారు. ఏజెన్సీ ప్రజల సౌకర్యార్ధం బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామన్నారు. వన్య ప్రాణులకు ప్రమాదం జరుగుందని రోడ్లకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. వన్య ప్రాణుల కోసం ప్రత్యేక బ్రిడ్జిలను వేయడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చన్నారు. పక్క రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆ నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలలో రోడ్ల సదుపాయం అత్యవసరమని వివరించారు. మేడారం జాతర కోసం చేపడుతున్న ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. ఈ వీసీలో ములుగు జిల్లా తరఫున కలెక్టర్ టీఎస్.దివాకర హాజరయ్యారు. అదే విధంగా నేటి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్న గ్రామ పాలనాధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ఈ మేరకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా తరఫున కలెక్టర్ దివాకర హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు జవాబు పత్రాలను 9.20 గంటలకు ప్రశ్నా పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతులు లేదని, కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు.
మేడారం జాతరకు ప్రత్యామ్నాయ రోడ్లకు అనుమతివ్వాలి
వీసీలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క