
పత్రికా స్వేచ్ఛను హరిస్తే పతనం తప్పదు
ములుగు: పత్రికా స్వేచ్ఛను హరిస్తే పసుపు రంగు ప్రభుత్వానికి పతనం తప్పదని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ అన్నారు. ఏపీలోని విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో గురువారం పోలీసులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురిచేసినందుకు నిరసనగా ములుగు సాక్షి ఆర్‌సీ ఇన్‌చార్జ్ భూక్య సునిల్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ములుగు జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు షఫీ అహ్మద్, రామిడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ పేరుతో సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ‘సాక్షి’పై కక్షపూరితంగానే ఎడిటర్ ఇంటికి వెళ్లి పోలీసులచే ఏపీ ప్రభుత్వం డ్రామా ప్లే చేయించిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎడిటర్లు, జర్నలిస్టులను నియంత్రించాలనుకోవడం అవివేకమన్నారు. పత్రిక స్వేచ్ఛను అడ్డుకున్న ప్రతీ రాజకీయ పార్టీకి తగిన గుణపాఠం తప్పదవి వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు చేస్తున్న నిరసనకు బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజ్‌మహ్మద్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు గుర్రం శ్రీధర్, గాదం దేవేందర్, బైకాని నటరాజ్, బానోతు వెంకన్న, మాట్ల సంపత్, చుంచు రమేష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
ఎండీ.షఫీ అహ్మద్