
హేమాచలుడి బ్రహ్మోత్సవం
రేపటి నుంచి ప్రారంభం ..12న లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్ల తిరుకల్యాణం
మంగపేట: మల్లూరుగుట్టపై స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రంలో స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) రేపటి(గురువారం) నుంచి పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు (వేదపండితులు) అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైభవంగా దేవతామూర్తుల కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టం 12వ తేదీ ఉదయం 9గంటలకు ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తుల కల్యాణం, మధ్యాహ్నం 12.23 గంటలకు లభిజిన్ లగ్నంలో ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గర్భాలయం, ఆలయ ప్రాంగణంలోని వేణుగోపాలస్వామి ఆలయం, అభయాంజనేయస్వామి, దైత అమ్మవారి ఆలయంతో పాటు తదితర ఆలయాలు, ప్రధాన ఆర్చీలను వివిధ రాకల రంగులతో అలంకరించారు. జాతర ప్రాంగణంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎండ తగలకుండా ఉండేందుకు ఆలయ ప్రాంణంలోని దైత అమ్మవారి ప్రాంగణం నుంచి స్వామివారి కల్యాణ మండపం వరకు ప్రత్యేకంగా తడకలతో పందిళ్లను ఏర్పాటు చేశారు.
భారీగా తరలిరానున్న భక్తులు
బ్రహ్మోత్సవాలు(జాతరకు) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో దేవాదాయశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కూర్చోని తిలకించే విధంగా కల్యాణ మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, పలు చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ తెలిపారు.
ప్రకృతి ప్రసాదం
చింతామణి జలపాతం
ఆలయ సమీపంలోని మామిడి తోపుల మధ్య ఔషధగుణాలు కలిగి చెట్ల వేర్ల నుంచి పారే చింతామణి జలపాతాన్ని భక్తులు ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. చింతామణి జలపాతం నీరు చల్లగా ఉండడమే కాకుండా సంవత్సరంలో 365 రోజులు పారుతూనే ఉంటుంది. నీరు మినరల్ వాటర్‌ను తలపించే విధంగా ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు ఎన్ని రోజులు నిల్వ ఉన్నా చెడిపోకుండా ఉండటం మరో విశేషం. ఔషధ గుణాలు కలిగిన చెట్ల వేర్ల కింది నుంచి వచ్చే నీటిని సేవిస్తే బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయమవుతాయని భక్తుల అపార నమ్మకం. ఇప్పటికి భక్తులు నీటిని క్యాన్లలో తీసుకువెళ్తుంటారు.
10 రోజుల పాటు కొనసాగనున్న జాతర
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

హేమాచలుడి బ్రహ్మోత్సవం

హేమాచలుడి బ్రహ్మోత్సవం