
ఓపికగా సమస్యలు వింటూ..
ములుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన అర్షం రవి తాపీమేసీ్త్రగా పనిచేసేవాడు. షుగర్‌తో రెండు కాళ్లు తీసేశారు. చిన్న గుడిసెలో భార్య, ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇంటికోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాడు. లీస్టులో పేరుసైతం వచ్చింది. తీరా సర్వే చేయగా ఇరవై ఏళ్ల క్రితం రవిపేరుతో ఇళ్లు సాంక్షన్ అయి ఉండడంతో రద్దు చేశారు. గతంలో ఇళ్లు మంజూరు అయిన విషయమే తనకు తెలియదని చెప్పినా అధికారులు వినలేదు. దీంతో భార్య రమతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడే హాల్‌లోకి వెళ్తున్న కలెక్టర్ దివాకర వికలాంగుడిని చూసి స్వయంగా దగ్గరకు వెళ్లి దరఖాస్తు తీసుకున్నారు. ఓపికగా సమస్య విన్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించి న్యాయం చేస్తానని కలెక్టర్ తెలిపారు.
పింఛన్ ఇప్పించండి..
జిల్లాకేంద్రానికి చెందిన కొయ్యడ సాంబలక్ష్మీ కుమార్తె సుమలత 15 సంవత్సరాలుగా మానసిక వికలాంగత్వంతో బాధపడుతోంది. వైద్యులను సంప్రదిస్తే వ్యాధి తగ్గదని చెప్పేశారు. దీంతో సదరం క్యాంపులో చూపించింది. మానసిక వికలాంగురాలిగా సదరం సర్టిఫికెట్ సైతం జారీ అయ్యింది. కానీ పింఛన్ రావడం లేదు. ప్రతినెలా కుమార్తె మందులకు రూ.2వేలు ఖర్చు అవుతున్నాయని తెలిపారు. పనిచేస్తే వచ్చే డబ్బుతో కుటుంబం గడపడం బిడ్డను చూసుకోవడం ఇబ్బందికరంగా ఉందని వాపోయింది. కుమార్తె నడవలేని స్థితిలో ఉన్న కారణంగా తానే వచ్చి దరఖాస్తు ఇచ్చానని చెప్పుకొచ్చారు.
– కొయ్యడ సాంబలక్ష్మి, ములుగు
●