
ములుగులో మోడల్ బస్టాండ్
ములుగు: జిల్లాకేంద్రంలో అత్యాధునిక హంగులతో మోడల్ బస్టాండ్ నిర్మాణం పనులు వచ్చే నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఈడీతో మాట్లాడి ప్రతినెలా చేపడుతున్న పనులపై నివేదిక ఇచ్చి పనుల్లో వేగం పెంచాలని సూచించామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లాకేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో 32గుంటల స్థలంలో రూ.4.81 కోట్ల వ్యయంతో గ్రౌండ్, ఫస్ట్‌ఫ్లోర్‌గా నిర్మించనున్న మోడల్ బస్టాండ్ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ 1989లో నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క చెప్పగానే వెంటనే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మోడల్ బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. మంగపేట మండలంలో రూ.50లక్షలతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయన్నారు. ఏటూరునాగారం డివిజన్‌లో చేపట్టనున్న బస్‌డిపో పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గట్టమ్మ ఆలయం సమీపంలోని గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్ భవనం, వైద్య కళాశాలలకు అనుగుణంగా విద్యార్థులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మినీ బస్టాండ్ నిర్మిస్తామన్నారు. కలెక్టర్ ఎకరం స్థలం కూడా కేటాయిస్తామని తెలిపారని, అధికారులు నివేదిక అంచనా ఇస్తే రూ.45లక్షలతో పనులు చేపడతామన్నారు.
బీసీలకు 42శాతం అమలుకు కృషి
అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇప్పటికే ములుగు మున్సిపాలిటీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యిందని వివరించారు. ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలో ఉన్న కారణంగా రవాణా పరంగా ఆర్టీసీ సేవలు అవసరం అని చెప్పడంతో సీఎం రేవంత్‌రెడ్డి అడిగినన్ని నిధులు కేటాయిస్తున్నారని మంత్రి వివరించారు. ఆర్టీసీ బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి ప్రభాకర్‌కు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా గట్టమ్మ ఆలయంలో పూజలు చేసిన మంత్రి పొన్నం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్ నుంచి పార్టీ కార్యకర్తలు భారీ బైక్‌ర్యాలీ నడుమ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలకు భారీ గజమాలతో సత్కరించారు. అలాగే జిల్లా కేంద్రంలోని మహర్షీ భగీరథుడి జయంతిని ఉత్సవాల్లో సీతక్క పాల్గొన్నారు. అనంతరం దేవగిరిపట్నం గ్రామంలో బాలబ్రహ్మచారి కిషన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి, నందీశ్వర, ధ్వజస్తంభ, గణపతి, దక్షిణామూర్తి, సుబ్రమణ్యేశ్వర స్వాముల నూతన విగ్రహ ప్రతిష్టాపన, ఆలయాన్ని ఘనంగా ప్రారంభించిన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు పొన్న ప్రభాకర్ హాజరై పలు సూచనలు చేశారు. లీలాగార్టెన్‌లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమ్మేళన కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆర్టీసీ ఈడీ సల్మాన్‌రాజ్, డిప్యూటీ ఆర్‌ఎం భానుకిరణ్, ఆర్డీఓ వెంకటేశ్, ఈఈ భాస్కర్, డిపో మేనేజర్లు జ్యోత్స్నచందర్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అత్యాధునిక హంగులతో నిర్మిస్తాం..
బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్