భక్తుల సౌకర్యార్థం మాస్టర్‌ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తుల సౌకర్యార్థం మాస్టర్‌ ప్లాన్‌

Mar 28 2025 1:43 AM | Updated on Mar 28 2025 1:39 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మాస్టర్‌ ప్లాన్‌ కోసం డిజైన్ల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన స్టూడియో వన్‌ ఆర్కిటెక్చర్ల డిజైనర్ల బృందం గురువారం మేడారంలో పర్యటించింది. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనుల కోసం డిజైన్లను రూపొందించనున్నారు. 2026లో జరిగే మహాజాతర వరకు మాస్టర్‌ ప్లాన్‌ అభివృద్ధి పనులపై డిజైన్లను రూపొందించనున్నారు.

అభివృద్ధి పనుల ప్రాంతాల పరిశీలన

మేడారానికి వచ్చిన డిజైనర్ల బృందం మేడారం ఈఓ రాజేంద్రంతో కలిసి సర్వే చేశారు. మేడారం జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్‌, దేవాదాయశాఖకు కేటాయించిన స్థలాన్ని, అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, మేడారం ఐలాండ్‌ ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనులకు డిజైన్‌ రూపాందించేందుకు సర్వే చేశారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు ఎంత మంది భక్తులు హాజరువుతారనే తదితర అంశాలను దేవాదాయశాఖ అధికారులను డిజైనర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వివరాల సేకరణ

మేడారంలో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు కావాల్సిన అభివృద్ధి పనుల వివరాలను డిజైనర్లు దేవాదాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈఓ రాజేంద్రంతో పాటు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పనుల వివరాలను బృందానికి వివరించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో కొబ్బరి కాయలు, బెల్లం నిల్వ చేసేందుకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు, అమ్మవార్ల ఆలయ విస్తరణ, రెడ్డిగూడెం లోలెవల్‌ కాజ్‌వే నుంచి చిలకలగుట్ట వరకు జంపన్నవాగు స్నానఘట్టాల పొడవునా బ్యూటీఫికేషన్‌ పనులు చేయాలని తెలిపారు. అలాగే సత్రాల నిర్మాణం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ గదులు, అమ్మవార్ల గద్దెల చుట్టూ వాచ్‌ టవర్ల నిర్మాణం, సమ్మక్క ప్రధాన ద్వారం ఎదుట మండపం, పూజారులకు గదుల నిర్మాణం, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, దేవాదాయశాఖకు కేటాయించిన 28 ఎకరాల్లో శృతి వనం ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనుల వివరాలను బృందానికి వివరించారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిజైనర్ల బృందం మేడారం అభివృద్ధి పనులపై డిజైన్లు రూపొందించి ప్రభుత్వానికి, దేవాదాయశాఖకు త్వరలో అందిస్తుందని ఈఓ రాజేంద్రం తెలిపారు. డిజైన్ల విడుదల అనంతరం నిధుల మంజూరు నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు.

మేడారంలో పర్యటించిన

డిజైనర్ల బృందం

అభివృద్ధి పనుల

డిజైన్‌ రూపకల్పనకు సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement