అడుగంటిన భూగర్భ జలాలు
మంగపేట: జిల్లాలో రోజు రోజుకూ భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో వరి పంట సాగుచేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వివిధ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నెల రోజుల క్రితం వరకు రెండున్నర ఇంచుల పైపు నిండా నీటిని పోసిన బోరుబావులు ప్రస్తుతం పనిచేయని పరిస్థితి నెలకొంది. పలు మండలాల్లో కొన్ని బోరుబావులు అలా పోస్తు ఇలా ఆగి పోతున్నాయి. ప్రస్తుతం వరి బిర్రు పొట్ట, గింజ పోసుకునే దశలో ఉండగా పలు మండలాల్లో ముందుగా నాట్లు వేసిన చోట గింజ పోసుకునే దశలో ఉంది. మండుతున్న ఎండలతోపాటు వరి పంటకు ఎక్కువగా నీరు అవసరమైన సమయం ఇప్పుడే కావడంతో సరిపడా నీటిని అందించడం కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. సమయానికి నీరు అందకపోతే పొట్ట దశలో ఉన్న పైరు వడలిపోయే ప్రమాదం ఉండగా కంకి బయటకు వస్తున్న పైరు గింజ పోసుకోకపోవడంతో తాలుగా మారుతుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మంగపేట మండలంలోని తిమ్మంపేటలో ఇప్పటికే బోరుబావుల్లో నీరు రాకపోవడంతో సుమారు 120 ఎకరాల మేర పైరు వడలిపోగా మరో 1,800 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దాదాపుగా జిల్లాలో ఇదే పపిరిస్థితి నెలకొనడంతో రబీలో వరి పంట సాగుచేసిన రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. జిల్లాలోని 9 మండలాల్లో 56,300 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు అధికారులు చెపుతుండగా.. అదనంగా మరో 10 వేల ఎకరాలకు పైచిలుగా సాగు చేసినట్లు అంచనా.
15 ఎకరాలు ఎండిపోతోంది
బోరు బావులు, చెరువు నీటిపై ఆధారపడి 18 ఎకారల్లో వరిపంట సాగు చేశా. ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ.40 వేల వరకు అయింది. కంకి దశలో ఉండగా బోరుబావుల్లో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. రూ.70,000 ఖర్చు చేసి నూతనంగా బోరువేశా. నీరు పడలేదు. గింజపోసుకునే దశలో ఉన్న సుమా రు 15 ఎకరాల పైరు పూర్తిగా ఎండిపోయింది.
– చిలకమర్రి భాస్కర్, రైతు, తిమ్మంపేట
ఆయకట్టు పంటలకు ఇబ్బంది లేదు
జిల్లాలో చెరువులు, ప్రాజెక్టుల కెనాల్ ఆయకట్లు పరిధిలో సాగు చేసిన వరి పంట ఏప్రిల్ మొదటి వారం వరకు కోత దశకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆయా పంటలకు అవసరమైన మేర సాగునీటికి ఢోకాలేదు. బోరుబావులపై ఆధారపడి సాగుచేసిన పంటలు ఎండిపోయిన విషయం మా దృష్టికి రాలేదు. – సురేష్, జిల్లా వ్యవసాయాధికారి
వట్టిపోతున్న బోరుబావులు
చివరి దశలో నీరందని పరిస్థితి
పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు
ఎండుతున్న వరి
ఎండుతున్న వరి