ములుగు: నిషేధిత మావోయిస్టు పార్టీలో పోరుపడలేక ఇటీవల స్వచ్ఛందంగా లొంగిపోయిన నేషన్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు ఒడిస్సా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా కలిమెల మండలానికి చెందిన అలువ స్వర్ణ అలియాస్ స్వర్ణక్క, జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం గ్రామానికి చెందిన పులుసం పద్మ అలియాస్ గంగక్క (దివంగత సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ భార్య)కు బుధవారం ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ ప్రభుత్వం తరఫున సరెండర్ కం రిహాబిలిటేషన్‌లో భాగంగా డీడీలు అందించారు. స్వర్ణక్కకు రూ.4లక్షలు, పుల్సం పద్మకు రూ.5లక్షల రివార్డులను అందించిన ఎస్పీ భవిష్యత్‌లో పోలీస్ శాఖ తరఫున అండగా ఉంటామని హామీనిచ్చారు. ఇప్పటికై నా వివిధ పార్టీలలో కొనసాగుతున్న వారంతా ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనజీవన స్రవంతిలో కలిసి జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు.
లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు