గోవిందరావుపేట: ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కృత్రిమ మేధాను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్యాబోధన అందిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మండల పరిధిలోని చల్వాయి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. గణితంలో సంఖ్య భావనలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలతో పాటు తెలుగులో విద్యార్థులు చేస్తున్న ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధనను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా 5ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3నుంచి 5వ తరగతి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అభ్యసన సామర్థ్యాలను పెంచే విధంగా ఏఐ ద్వారా బోధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పదో తగరతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను పరిశీలించిన కలెక్టర్ వారితో మాట్లాడారు. వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని పలు సూచించారు. పాఠశాలలో వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్, కేజీబీవీ విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పాణిని, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జయప్రద, ఎంపీడీఓ జవహర్ రెడ్డి, తహసీల్దార్ సృజన్ కుమార్, ఏఎంఓ మల్లారెడ్డి పాల్గొన్నారు.
పోషకాహారం తప్పనిసరి
ములుగు: కంటి లోపాలను అధిగమించేందుకు పోషకాహారాలైన ఆకుకూరలు, గుడ్లు, చేపలు, పాలు, పండ్లను తప్పనిసరిగా తగిన మోతాదులో తీసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. రాష్ట్రీయ బాలస్వస్త్య కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా దృష్టిలోపం ఉన్న వారికి సోమవారం తన ఛాంబర్‌లో కంటి అద్దాలు అందించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
ఏఐతో విద్యాబోధన సులభతరం