ములుగు: మండల పరిధిలోని జాకారంలో గల సమ్మక్క–సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి వీసీగా బాధ్యతలు స్వీకరించిన వైఎల్.శ్రీనివాస్ సోమవారం వర్సిటీని సందర్శించారు. ఓఎస్డీ వంశీకృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. యూనివర్సిటీలోని గ్రూపులు, ఎంత మంది విద్యార్థులు. యూనివర్సిటీలోని సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు. తనకు కేటాయించిన ఛాంబర్‌లో కూర్చుని యూనివర్సిటీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కలెక్టర్ దివాకరను మర్యాద పూర్వకంగా కలిశారు. యూనివర్సిటీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లి అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ సూచించారు.
రామప్పలో
ట్రెయినీ అధికారులు
వెంకటాపురం(ఎం): హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు సోమవారం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సులో బోటింగ్ చేసి సరస్సు అందాలను తిలకించారు. వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీఐటీ అధికారులు శ్రీనివాస్, రవి ఉన్నారు.
మత్స్యకారులకు
శిక్షణ ప్రారంభం
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన ఎస్టీ మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ చేపల పెంపకంలో పద్ధతులు, చేపల సంరక్షణ, దాణా తయారీపై అవగాహన కల్పించారు. అనంతరం జుజుల్‌రావుపేట, నాచేపల్లిలోని ఫిషరీస్ కేంద్రాలను తీసుకెళ్లి వివిధ రకాల చేపలు, రొయ్యల పెంపకం తీరును వివరించారు.
ట్రైబల్ యూనివర్సిటీని సందర్శించి వీసీ
ట్రైబల్ యూనివర్సిటీని సందర్శించి వీసీ