ములుగు: మాదిగలను నమ్మించి సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు ఇరుగు పైడి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఽఆధ్వర్యంలో చేపటిన నిరసన దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అమలు చేస్తానని, అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువస్తానని మాదిగలను నమ్మించి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని తెలిపారు. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మాదిగలకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో శ్యామ్‌బాబు, భిక్షపతి, సుందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.