ములుగు : గంజాయి, పశువుల అక్రమ రవాణాపై పోలీసు శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన చాంబర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా పెంచామని అన్నారు. 2024 సంవత్సరంలో పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై 30 కేసులు నమోదు చేసి 296 పశువులను సంరక్షించి వాటిని పలు ప్రాంతాల్లోని గోశాలలకు తరలించామని తెలిపారు. 85 మందిని అరెస్ట్ చేసి చేశామన్నారు. 2025 జనవరి 1 నుంచి మార్చి 14 వరకు ఒక కేసు నమోదు చేసి నేరస్తుడిని అరెస్ట్ చేశామని, ఎనిమిది పశువులను రక్షించామని అన్నారు. గంజాయి విషయంలో 2024లో మొత్తం నాలుగు కేసులు నమోదు చేసి రూ.1, 09,242 విలువ కలిగిన 11.413 కిలోలను గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నాలుగు కేసుల్లో మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని అన్నారు. 2025 జనవరి 1 నుంచి నేటి వరకు ఒక కేసు నమోదు చేసి రూ.62, 125 విలువ కలిగిన 2.485 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. గంజాయిరహిత సమాజం కోసం ములుగు సబ్ డివిజన్ పోలీసు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. హైస్కూల్ నుంచి డిగ్రీ కళాశాల స్థాయి వరకు యాంటీ డ్రగ్ వారియర్స్ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించి వారితో స్నేహపూరితంగా మెదులుతున్నామని అన్నారు. గంజాయి కేసుల పాలైన పాత నేరస్తులపై సస్పెక్ట్‌స్ షీట్స్ ఓపెన్ చేశామని అన్నారు. యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలతో అనుమానిత ప్రదేశాల్లో మాదకద్రవ్యకాల నిర్మూలనకు నిత్యం తనిఖీలు చేస్తున్నామని అన్నారు. మాదకద్రవ్యకాల రవాణా, అమ్మకాలపై ఎవరికై నా సమాచారం ఉంటే డయల్ 100కు కానీ ప్రత్యేక టోల్‌ఫ్రీ 1908కి కానీ ఫోన్ చేసి వివరాలు అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తున్న సబ్ డివిజన్ పోలీసులను ఎస్పీ శబరీష్ అభినందించారని అన్నారు.
ములుగు డీఎస్పీ నలువాల రవీందర్