
గ్రావిటీ కెనాల్ వివరాలు ఇలా..
ములుగు: రామప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా లక్నవరం చెరువుకు నీటిని అందించడానికి ప్రభుత్వం తరఫున ముందడుగు పడింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క చొరవతో గత ఆరున్నర సంవత్సరాల నుంచి మూలన పడిన ఫైల్‌లో తిరిగి కదలిక వచ్చింది. ఈ మేరకు రెవెన్యూశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కన్నాయిగూడెం మండలం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా భీం గణపూర్ మీదుగా రామప్ప సరస్సుకు నిత్యం నీటిని అందిస్తున్నారు. దీంతో 365 రోజుల పాటు 27 నుంచి 33 ఫీట్లకు తగ్గకుండా నీటి నిల్వ ఉంచుతున్న విషయం తెలిసిందే. నీటి నిల్వ ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది యాసంగి సాగుకు ఎలాంటి తడబాటు లేకుండా అధికారులు 5,180 ఎకరాలకు తైబందీ ఖరారు చేశారు. సాగుకు పోనూ నీటిని ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం మండలం గణప సముద్రంకు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నర్సంపేట, పాకాల, నెక్కొండ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువుకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని మళ్లించాలని 2018లో అప్పటి అధికారులు ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా జే చొక్కారావు దేవాదుల లిఫ్ట్(జేసీఆర్) ఇరిగేషన్ అధికారులు క్రాస్ మాసోనరీ(సీఎం), క్రాస్ డ్రైనేజ్ డిజైన్(సీడీ)ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో భాగంగా అప్రోచ్ కెనాల్‌కు 2.025 కిలో మీటర్లు 6.160 క్యూబిక్ మీటర్ ఫర్ సెకండ్ (క్యూమెక్స్) డిశ్చార్జీతో, మెయిన్ గ్రావిటీ కెనాల్‌కు 4.850 కిలోమీటర్ల మేర 4.840 క్యూమెక్స్ డిశ్చార్జీతో చేపట్టేందుకు సిద్ధమైంది. వీటికి అవసరమైన 145 ఎకరాల భూసేకరణ విషయం మంత్రి సీతక్క ప్రయత్నంతో ఇటీవల తెరపైకి వచ్చింది.
2019లో ఆగిన సర్వే
భూ సేకరణకు గానూ ప్రభుత్వం 2018లో రూ.14.53 కోట్ల ఎస్టిమేషన్ డబ్బులు అందించడానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రూ.4కోట్లను అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అకౌంట్(ప్రభుత్వం తరఫున అధికారికంగా ఉన్న ఖాతా)కు ట్రాన్స్‌ఫర్ చేసింది. 2019లో సర్వే ప్రారంభించిన రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.2.45 లక్షలు చెల్లిస్తామని రైతులతో చర్చించారు. రైతులు అప్పటి రేటు ప్రకారం ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.9నుంచి 12లక్షలు పరిహారం అడిగారు. దీంతో డోలాయమానంలో పడ్డ అధికారులు అప్పటి మంత్రులు, కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. చివరికి రూ. 8.5 లక్షలు ఇవ్వాలని రైతులు అడిగినా అధికారులు ముందుకురాలేదు. దీంతో ప్రాజెక్టు ఫైల్ కథ కంచికి చేరింది. ఇదంతా చూసిన తర్వాత భూ సేకరణ తర్వాత తమను సంప్రదించాలని జేసీఆర్ ఇంజనీరింగ్ అధికారులు తేల్చారు. మొత్తానికి రైతులకు, రెవెన్యూ అధికారులకు మధ్య సయోధ్య కుదరక మధ్యలోనే పనులు ఆగిపోయాయి.
లక్నవరం సరస్సు(ఫైల్)
ప్రాజెక్టు నీటి తరలింపు రామప్ప నుంచి
లక్నవరంకు
అవసరమైన భూమి 145 ఎకరాలు
మొత్తం గ్రావిటీ కెనాల్ 4.850కిలో మీటర్లు
అప్రోచ్ కెనాల్ 2.025కిలో మీటర్లు
తెరపైకి రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణం
2018లో మంజూరైన ప్రాజెక్టు
ఇటీవల రైతులతో మంత్రి సీతక్క సమీక్ష
భూ పరిహారంలో రైతులు, రెవెన్యూ అధికారులకు కుదరని సయోధ్య
6.875 కిలోమీటర్ల కాల్వకు
ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదనలు
మంత్రి సీతక్క చొరవతోనే..
రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ విషయమై రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుంది. ముందుగా సమస్యను ఇరిగేషన్, రెవెన్యూ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి లోతుగా చర్చించారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం భూమి కోల్పోతున్న రైతులకు ఎంత మేర పరిహారం అందిచవచ్చేనే అంశంపై కొలిక్కి వచ్చింది. అదే విషయాన్ని ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో రైతులతో సమీక్ష నిర్వహించారు. రైతుల అభిప్రాయాలను సేకరించి రేటు విషయమై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. అయితే జిల్లా ఏర్పాటు అనంతరం భూములు రేట్లు భారీగా పెరిగాయని జాతీయ రహదారి వెంబడి ఉన్న భూములకు ఎకరానికి రూ. 20లక్షల వరకు, లోపలి భూములకు ఎకరానికి రూ.15 లక్షల వరకు చెల్లించాలని రైతులు మంత్రితో విన్నవించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా భూమిరేటు తెగాలంటే ముందుగా గ్రావిటీ కెనాల్‌కు సంబంధించి మార్కింగ్ చేయాలని, జాతీయ రహదారి వెంబడి ఎన్ని ఎకరాలు, లోపలి భాగంలో ఎన్ని ఎకరాల భూమి అవసరం ఉందో గుర్తించాలని మంత్రి రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో అధికారులు మార్కింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం
రామప్ప నుంచి లక్నవరం వరకు నిర్మించనున్న గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో భూమి కోల్పోయే రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం. ఎంత మేర భూమి అవసరం ఉంది. జాతీయ రహదారి వెంబడి, లోపలి ప్రాంతాల్లో ఎంత వరకు పరిహారం చెల్లించాలనే విషయంపై జంగాలపల్లి, కాసిందేవిపేట రైతులతో చర్చించాం. ముందుగా కెనాల్ నిర్మాణానికి మార్క్ చేసి ప్రతిపాదనలు అందించాలని అధికారులకు సూచించారు. తదనంతరం రైతులు అడిగిన రేటు, ప్రభుత్వం తరఫున అందించే రేటును బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుంటాం. రైతులు సహకరించాలి.
– సీతక్క, రాష్ట్ర మంత్రి

గ్రావిటీ కెనాల్ వివరాలు ఇలా..