ములుగు రూరల్: విద్యార్థులు చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ అన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణపై మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల సరఫరా లేదా తోటి విద్యార్థులు అలవాటుపడినట్లు తెలిస్తే పోలీస్‌లకు, యాంటీ డ్రగ్ కమిటీకి లేదా పాఠశాల ప్రిన్సిపాల్‌కు విషయం చెప్పాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు డీఎస్పీ చేతుల మీదుగా హాల్ టికెట్లను అందించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వరరావు, సీడీపీఓ ఓంకార్, ప్రిన్సిపాల్ ఝాన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.