
మంగపేట/వెంకటాపురం(కె): మంగపేట, వెంకటాపురం(కె) మండలాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మంగపేట మండలంలో గంటన్నర పాటు భారీ వర్షం దంచి కొట్టింది. దీంతో తిమ్మంపేట బోరునర్సాపురం, కమలాపురం తదితర గ్రామాల్లోని వరి పొలాల్లో ధాన్యం గింజలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. పలుచోట్ల కల్లాల్లోని నుంచి వర్షపు నీరు వరదలై పారడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందేలా చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు. అదే విధంగా వెంకటాపురం మండల కేంద్రంలోని పలుచోట్ల రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగి పడడంతో పాటుగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మిర్చి కల్లాల్లో పలువురు రైతులు మిరప కాయలు తడవకుండా వేసిన టార్పాలిన్లు గాలికి కొట్టుకు పోయి మిరప కాయలు తడిశాయి. వెదుల్ల చెరువు సమీపంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగిపడటంతో రాక పోకలుకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ఆర్‌ఆండ్‌బీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
నేలరాలిన ధాన్యం
కల్లాలోని తడిసిన మిర్చి


బోరునర్సాపురంలో నేల రాలిన ధాన్యం

వెంకటాపురం(కె): వర్షానికి తడిసిన మిర్చి

వెదుల్ల చెరువు వద్ద రోడ్డుపై పడిపోయిన చెట్టు