
ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక
ట్రైలర్ తో ‘కింగ్‌డమ్’పై అంచనాలు తారాస్థాయికి
వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్‌డమ్’ చిత్రంతో ఘన విజయం సాధిస్తాను : కథానాయకుడు విజయ్ దేవరకొండ
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.
‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "గత సంవత్సర కాలంగా 'కింగ్‌డమ్' గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.