బిజినెస్‌లోనూ రాణిస్తున్న తారలు

Tollywood Actors Who Own A Business Apart From Movies - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): సినిమా ప్రపంచం అంటేనే రంగుల లోకం. ఎవరు ఎప్పుడు ఉన్నతస్థానానికి చేరతారో.. ఎప్పుడు పాతాళానికి పడిపోతారో తెలియదు. ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. లేదంటే ఎంతటి దుర్భర పరిస్థితులు చవి చూడాల్సి వస్తుందో కొందరు సీనియర్‌ నటులను గమనిస్తే తెలుస్తుంది. అలాకాకపోయిన ఈ ఫీల్డ్‌లో దీర్ఘకాలం కొనసాగడం కష్టం. ఎప్పుడో అప్పుడు తప్పుకోక తప్పదు. అందుకే చాలా మంది నటులు ముందు జాగ్రత్తగా వేరే వ్యాపారాలు ప్రారంభించారు. స్టార్‌ హీరోలు మొదలు యువ కథానాయకుల వరకు ప్రతి ఒక్కరు ఇదే మార్గంలో ఉన్నారు. మరి మన తారలు చేస్తోన్న ఆ వ్యాపారాలేంటో చూడండి..


చిరంజీవి..
మెగా కుటుంబానికి ఇప్పటికే కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇవి కాకుండా చిరంజీవికి కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయితే వాటిలో చాలా వాటి గురించి ఎవరికి తెలియదు. ఇకపోతే చిరంజీవి తాజాగా నాగార్జున, సచిన్ టెండూల్కర్, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ సహకారంతో క్రీడా వ్యాపారంలో అడుగుపెట్టారు. చిరంజీవి ఇప్పుడు కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ-యజమాని.  మా టీవీలో కూడా కొంత పెట్టుబడి పెట్టారు.


నాగార్జున..
ఓ వైపు హీరోగా.. మరోవైపు యాంకర్‌గా.. ఇంకోవైపు నిర్మాతగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న నాగార్జున ఇంకా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తున్నారు. ఎన్ గ్రిల్ రెస్టారెంట్, ఎన్ కన్వెన్షన్ సెంటర్లను నడిపిస్తున్నారు. కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సైతం కో ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక స్టార్ మా లో పెట్టుబుడులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. (చదవండి: డెవిల్స్‌ ఎట్‌ వర్క్‌)


మహేష్‌బాబు..
సూపర్‌సస్టార్‌ మహేష్‌ బాబు వృత్తి, ప్రవృత్తి రెండు సినిమాలే. మూవీస్‌లో నటిస్తూనే.. చిత్ర నిర్మాణంలో కూడా అడుగుపెట్టారు. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో తన సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించడం ప్రారంభించారు. దాంతో పాటు నారాయణదాస్ నారంగ్ నేతృత్వంలోని ఆసియా గ్రూప్ సహకారంతో ఏఎంబీ సినిమాస్ (ఆసియా మహేష్ బాబు సినిమాస్) పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారంలో అడుగుపెట్టారు. ఇది గచ్చిబౌలిలో ఉంది. ఏడు స్క్రీన్లు కల సూపర్‌ప్లెక్స్.


మోహన్ బాబు..
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు రూటే సపరేటు. విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం నిర్మాతగా, నటుడిగా కొనసాగుతున్నారు. దాంతో పాటు విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఆయన బాటలోనే మంచు విష్ణు కూడా నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. (చదవండి: అమ్మ కోసం చేపల వేపుడు)


జగపతి బాబు..
ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జగపతి బాబు. సినిమాల్లో హీరోగా, విలన్‌గా రెండింట్లోనూ రాణించిన ఈయన టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని మొదలుపెట్టారు. ‘క్లిక్ సినీ కార్ట్’ పేరుతో వెబ్ పోర్టల్‌ని ప్రారంభించారు. సినీరంగానికి, ఔత్సాహికులకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు.


రామ్ చరణ్.. 
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ చిన్నవయసులోనే బిజినెస్‌లో అడుగుపెట్టారు. హైదరాబాద్ పోల్ అండ్ రైడింగ్ క్లబ్‌‌కి యజమాని అయ్యారు. టర్బో మెగా ఎయిర్ వేస్ లిమిటెడ్‌ను స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. చెర్రికి భార్య ఉపాసన ఎంతగానో సహకరిస్తున్నారు. ఇటీవలే నిర్మాతగా మారి తన తండ్రి 150వ చిత్రాన్ని నిర్మించారు. తొలి సినిమాతోనే సక్సెస్‌ అందుకున్నారు. కొణిదెల బ్యానర్ మీద కొత్త వారికి కూడా అవకాశాలిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఈ బ్యానర్‌లోనే నిర్మించారు.


అల్లు అర్జున్..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా అంతర్జాతీయ కంపెనీ ఎం.కిచెన్‌తో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్‌ను రన్ చేస్తున్నారు. ఇందులో పార్టీలు, ఈవెంట్స్ చేసుకునేందుకు అన్ని సౌకర్యాలుంటాయి. సెలబ్రెటీలు ఎంజాయ్ చేసేందుకు ఇది మంచి కేంద్రంగా మారింది. ఈ రెస్టారెంట్ కాంటినెంటల్, మెక్సికన్, అమెరికన్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, జపనీస్ వంటకాలను అందిస్తుంది. (చదవండి: కుంటాల సందర్శన.. అల్లు అర్జున్‌పై ఫిర్యాదు)

దగ్గుబాటి రానా.. 
దగ్గుబాటి రానా అయితే సినిమా రంగంలోకి రాకముందే నుండే వ్యాపార రంగంలో ఉన్నారు. వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ ఓనర్‌గా ఉండేవారు. హీరోగా మారిన తర్వాత కూడా కా క్వాన్‌(సీఏఏ కేడబ్ల్యూఏన్‌) మేనేజ్ మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ముంబైలో ఉన్న ఈ కంపెనీ ద్వారా కొత్త నటీనటులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తున్నారు.

శర్వానంద్‌..
విభిన్నమైన కథలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్‌ ‘బీన్జ్‌’ అనే కాఫీ హౌస్‌ను ప్రారంభించారు. ‘ది అర్బన్ కాఫీ విలేజ్’ అనే క్యాచి ట్యాగ్‌లైన్‌తో వెదురుతో అలంకరించి ఉండే ఈ కాఫీ హౌస్‌ ఇప్పటికే తెగ ఫేమస్‌ అయ్యింది. జూబ్లీహిల్స్ క్లబ్ సమీపంలో ఉన్న బీన్జ్.. భారతీయ, జపనీస్, అరేబియన్‌ కాఫీ రుచులతో పాటు హై రేంజ్‌ వెరైటీ కాఫీలను అందిస్తుంది. దాంతో పాటు రకరకాల స్నాక్స్‌, డిజర్ట్‌లను కూడా సర్వ్‌ చేస్తుంది.

విజయ్‌దేవరకొండ..
టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలతో పాటు వ్యాపారాన్ని ప్రారంభించారు. తన సొంత దుస్తుల బ్రాండ్ రౌడీ వేర్‌తో వ్యాపార రంగంలోకి దిగారు. (చదవండి: వావ్‌..‘మైండ్‌ బ్లాక్‌’ చేసిన సితార)

మంచు విష్ణు
హీరో మంచు విష్ణు తన భార్య వెరోనికాతో కలిసి న్యూయార్క్ అకాడమీ అనే పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో, ముఖ్యంగా అమెరికన్ ప్రమాణాల ప్రకారం నిర్వహించబడుతుంది. ‘ఇట్స్‌ ఆల్‌ బిగిన్స్‌ హియిర్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న అమెరికన్ స్కూల్ ఇది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విష్ణు స్వయంగా ఈ పాఠశాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

కాజల్‌ అగర్వాల్‌
దశాబ్దానికి పైగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈ టాలీవుడ్ భామ సినిమాలతో పాటు అనేక రకాల బిజినెస్‌లను చేస్తోంది. కాజల్ పేరు మీద ఓ జ్యువెలరీ షాపుతో పాటు ఒక షూ కంపెనీ కూడా ఉంది. తన చెల్లి నిషా అగర్వాల్ ఇవన్నీ చూసుకుంటోందట. చందమామతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ తాజాగా నిర్మాతగా మారనున్నారట. అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడుతోందట. కేఏ వెంచర్ పేరుతో అందుకు సంబంధించిన పనులను ప్రారంభించిందంట.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరితో నటించేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా తాజాగా బిజినెస్ వైపు అడుగులు వేసింది. ఇప్పటికే జిమ్ బిజినెస్‌ను మొదలుపెట్టిన రకుల్‌.. మరిన్ని బ్రాంచ్ లను ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. (చదవండి: నా పరువు తీస్తున్నారు!)

తాప్సీ
తెలుగులో తాప్సీ నటించింది తక్కువ సినిమాలే అయినా డార్లింగ్ సినిమా హిట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమట. అందుకే సంపాదించిన సొమ్మునంతా స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడి పెడుతోందట. 

వీరేకాక నవదీప్‌, కమల్‌ కామరాజు, సచిన్‌ ఆర్‌. జోషి, రజనీకాంత్‌, విజయ్‌, సూర్య పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top