
సినీ ఇండస్ట్రీలో పారితోషికాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకైతే ఏకంగా వంద కోట్లు ముట్టజెప్పాల్సిందే. కొందరు బిగ్ స్టార్స్ ఏకంగా వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే పారితోషికాలు అంత ఎక్కువగా ఉండవు. హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్లో పదిశాతం కూడా ఉండకపోవచ్చు. అలాంటిది ఒక హీరోయిన్కు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది? అది మన బాలీవుడ్ సినిమాలో ఇంతలా భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ సిడ్నీ స్వీనీ కోసం బాలీవుడ్ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. 'యుఫోరియా', 'ది వైట్ లోటస్' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న సిడ్నీ త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఈ బిగ్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.
ఓ నివేదిక ప్రకారం 28 ఏళ్ల సిడ్నీ స్వీనికి ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 530 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేందుకు సంప్రదించిందని టాక్. ఒకవేళ ఆమె ఈ డీల్ అంగీకరిస్తే బాలీవుడ్ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ జరగనుందని సమాచారం. మొదట ఈ ఆఫర్ చూసి సిడ్నీ స్వీనీ ఆశ్చర్యపోయిందని ఓ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ బిగ్ డీల్‌కు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సిడ్నీ తరఫున ప్రతినిధులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం సిడ్నీ స్వీనీ 'క్రిస్టీ' అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో యూఎస్ పోరాట యోధురాలు క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఆ తర్వాత సిడ్నీ నటించిన మరో చిత్రం 'ది హౌస్‌మెయిడ్' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.