ఆడవాళ్ల శరీరం లైంగిక ఆకర్షణ కోసమే కాదు.. ట్రోలర్స్‌పై నటి ఫైర్‌! | Swara Bhasker Fires Back At Trolls Over Body Shaming, Says Women’s Bodies Are Not Just For Glamour | Sakshi
Sakshi News home page

మహిళ శరీరం కేవలం లైంగిక ఆకర్షణ కోసమే కాదు.. బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్

May 3 2026 9:20 AM | Updated on May 3 2026 7:07 PM

Swara Bhasker Slams Body SHamers OVer Post Pregnancy

మహిళలపై బాడీ షేమింగ్‌ చేసేవాళ్లపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ స్వరా భాస్కర్‌ మరోసారి ఫైర్‌ అయింది. ఆడవాళ్ల శరీరం కేవలం గ్లామర్‌ ప్రదర్శించడానికి, లైంగిక ఆకర్షణ కోసమే కాదని.. ఒకరికి ప్రాణం పోయడం వంటి గొప్ప పని కూడా చేస్తుందని, అలాంటప్పుడు శరీరంలో మార్పులు రావడం చాలా సహజమని, వాటిని స్వీకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

తను వెడ్స్ మను’, ‘రాంజనా’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్..2023లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  డెలివరీ తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. బరువు పెరిగి కాస్త లావుగా మారింది. అయితే తాజాగా తన పాత ఫోటోని, ప్రస్తుత ఫోటోని కలిపి ఒక కొలాజ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ ఫోటో కాస్త వైరల్‌ కావడం.. కొంతమంది నెటిజన్స్‌ ‘గుర్తుపట్టలేనంత మారిపోయింది’.  ‘ఇక ఆమె కెరీర్‌ క్లోజ్‌’ అంటూ బాడీ షేమింగ్‌ చేస్తూ కామెంట్స్‌ పెట్టారు.

వీటిపై ఆమె తీవ్రంగా స్పందించారు.  ‘ఒక ప్రాణానికి జన్మనివ్వడం సాధారణ విషయం కాదు. ఆ సమయంలో బాడీ ఎన్నో మార్పులకు గురవడం చాలా సహజం. బిడ్డ పుట్టిన తర్వాత  కూడా మళ్లీ ఇంతకుముందులానే ఉండాలని ఒత్తిడి  చేయడం సరికాదు. ఆడాళ్లు షోకేస్‌లో పెట్టే అందాల బొమ్మలు అసలే కాదు’ అంటూ ఇన్‌స్టాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది.

‘నేను ఈ మాటను పదే పదే ప్పాలనుకుంటున్నాను. మహిళల శరీరం కేవలం ఆకర్షణ కోసం లేదా గ్లామర్ కోసం కాదు. నాకు బిడ్డ పుట్టిన తర్వాత మునపటిలా మారాలని అనుకోలేదు. ఎందుకంటే మీకు బిడ్డ పుట్టాక, మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. మీరు జీవితాంతం తల్లిదండ్రులుగానే ఉంటారు. జీవితం పూర్తిగా మారిపోతుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. నిజమే.. మనం మన పాత జీవితాన్ని, చిన్ననాటి స్వేచ్ఛా లైఫ్ ను, సన్నగా ఉన్న శరీరాన్ని మిస్ అవుతాం. కానీ మన చిన్ననాటిలాగే ఉండాలని అనుకోవడం, మన శరీరాన్ని గతంలోకి బలవంతంగా నెట్టడం ఒకరకమైన క్రూరత్వం.

మన శరీరం మరో మనిషికి జన్మనిచ్చింది. కనుక శరీరం మారడం సహజం. కెమెరాల కోసం, అపరిచితుల కోసం ఆకర్షణీయంగా కనిపించాలని ఒత్తిడి పెంచుకోవడం తెలివి తక్కువ పని. డెలీవరీ తర్వాత బరువు పెరిగిన మహిళలపై  బాడీ షేమింగ్‌ చేయడం నీచమైన పని.

ఒక మహిళ..తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా బతకాలి. అలా అని నేను ఫిట్‌నెస్‌గా ఉండకూడదని చెప్పడం లేదు. మన శరీరాలను గౌరవించుకోవడానికి, మనకు సరిపోని పరిమితుల్లో మనల్ని మనం బంధించుకోవడం ఆపడానికి చేసే వాదన. జీవితం అనేది మన అంతరాత్మలోకి, ముందుకు సాగే ఒక ప్రయాణం. మన శరీరాలకు కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడంలో తప్పులేదు’ అని స్వరా భాస్కర్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

ఇక నటీనటులు గ్లామర్‌గా ఉండాలని చెప్పేవాళ్లకు కూడా ఆమె కౌంటర్‌ ఇచ్చింది.‘నటన అనేది టాలెంట్‌కు సంబంధించిన విషయం. దానికి మనిషి బరువుతోనో, గ్లామర్‌తోనో అస్సలు సంబంధం లేదు’ అని స్వరా భాస్కర్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారగా.. పలువురు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్‌ పెడుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement