త్వరలోనే వస్తా.. మిమ్మల్ని కలుస్తా: సోనూసూద్‌

Sonu Sood Praises Villagers Over Construction Ghat Road By Collecting Money Own - Sakshi

ముంబై: ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా గిరిజనులు తమ సమస్యలను తామే పరిష్కరించుకున్న తీరుపై ‘రియల్‌ హీరో’ సోనూసూద్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మీలాంటి ఇంకెంతో మంది వ్యక్తులు ఇలాగే ముందుకు వచ్చి తమ పనులు తామే చక్కబెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఇలాంటివి మరిన్ని చూడాలని ఉంది. త్వరలోనే అక్కడికి వస్తాను. మిమ్మల్ని కలుస్తాను. మీరు జాతి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారు. వెల్‌డన్‌ హీరోస్‌’ ’అంటూ ట్విటర్‌ వేదికగా కొనియాడారు. ఇకపై కావళ్లపై మనుషులను మోసుకెళ్లే అవసరం ఉండదంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఏఓబీలో గల గిరిశిఖర కొదమ పంచాయతీ చింతామలలో సుమారు 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలో భారీ సంత జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లాలన్నా, మరే ఇతర అవసరాల కోసమైనా ఈ పంచాయతీ గిరిజనులు సబకుమరి జంక్షన్‌ దాటాల్సి ఉంటుంది.(వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చిన సోనూ సూద్‌)

అయితే జంక్షన్‌ వరకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వేసిన బీటీ రోడ్డు మాత్రమే ఉంది. అయితే దాటేందుకు రోడ్డు వేయాల్సిందిగా దశాబ్దాల తరబడి అర్జీలు పెట్టుకున్నా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో గిరిజనులు తమ సమస్యను తామే తీర్చుకునేందుకు నడుం బిగించారు. సబకుమరి జంక్షన్‌ వరకు రోడ్డు నిర్మాణానికై చింతామల గ్రామస్తులు ఇంటికి రెండు వేల చొప్పున చందాలు సేకరించారు. వాటితో రెండు ప్రొక్లెయిన్లను రప్పించి కొండను తవ్వించి ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇక గతంలోనే పగులుచెన్నేరు గ్రామస్తులు పట్టుచిన్నేరు నుంచి తమ గ్రామానికి శ్రమదానంతో మట్టి రోడ్డు వేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్‌ సోనూసూద్‌ దృష్టికి తీసుకువెళ్లగా గిరిజనులపై ప్రశంసలు కురిపించారు. ఇక లాక్‌డౌన్‌లో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంతో మొదలైన సోనూ దాతృత్వ పరంపర నేటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top