Shagufta Ali: ఆస్తులు అమ్మేసిన నటి, సాయం కోసం ఎదురుచూపు

Shagufta Ali Reaches Out To Sonu Sood For Financial Help After CINTAA Offers Negligible Amount - Sakshi

పలు సీరియళ్లలో నటించిన ప్రముఖ సీనియర్‌ నటి షగుఫ్త అలీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. దీనికి తోడు కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడుతున్నాయి. కరోనా వల్ల ఉపాధి లేక ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. దీంతో తనను ఆదుకోండంటూ దీనంగా అర్థిస్తోందీ సీనియర్ నటి. తాజాగా ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నానని, కానీ తనను అనారోగ్య సమస్యలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయంది. నాలుగేళ్లుగా మరీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నానంది. మధుమేహం, కంటిచూపు మందగింపు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కారు, బంగారు నగలను కూడా అమ్మేసానని తెలిపింది. ఇప్పుడు ఆస్పత్రికి కూడా ఆటోలోనే వెళ్తున్నానని పేర్కొంది. యాక్టింగ్‌ ఆఫర్లు కూడా రాకపోవడంతో 30 ఏళ్లుగా ఎంతో గౌరవంగా బతికిన తాను ఇప్పుడు దుర్భర పరిస్థితిలో జీవితం నెట్టుకొస్తున్నాని దీనంగా చెప్పుకొచ్చింది.

ఏమైనా భరోసా కల్పిస్తాడేమోనన్న ఆశతో ఆమె సోనూసూద్‌ను సైతం సంప్రదించాలనుకుంది. అయితే వారు సేవలందిస్తారే తప్ప డబ్బు సాయం చేయరని తెలిసి నిట్టూర్పు విడిచింది. ఆమె పరిస్థితి గురించి తెలిసిన సింటా (సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) నటికి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. కానీ వారు ఇవ్వాలనుకుంది చిన్న మొత్తం కావడంతో ఆ సాయాన్ని ఆమె నిరాకరించింది. ఈ విషయం గురించి ఆమె స్పందిస్తూ.. "ఇప్పటివరకు నాకు ఎలాంటి సాయం అందలేదు. సింటా సాయం చేస్తానంది కానీ, వాళ్లు ఇవ్వాలనుకున్న మొత్తం నాకు దేనికీ సరిపోదు. అందుకే వద్దన్నాను. సోనూసూద్‌ను కూడా కలవాలనుకున్నా. కానీ వాళ్లు ఆర్థికసాయం చేయరని తెలిసి ఆగిపోయాను. నాకిప్పుడు ఆర్థిక సాయం చాలా అవసరం, దయచేసి ఎవరైనా హెల్ప్‌ చేయండి" అని దీనంగా అర్థిస్తోంది షగుఫ్త అలీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top