ఇప్పుడు నాకు ఫ్యాన్స్‌ ఎక్కువయ్యారు! | Sakshi Interview About Actor Chandra Mohan | Sakshi
Sakshi News home page

ఇప్పుడు నాకు ఫ్యాన్స్‌ ఎక్కువయ్యారు!

May 23 2021 12:29 AM | Updated on May 23 2021 7:34 AM

Sakshi Interview About Actor Chandra Mohan

నాయకుడు.. ప్రతినాయకుడు... హాస్యనటుడు.. సహాయనటుడు... ఇలా నటుడిగా చంద్రమోహన్‌ గుర్తుండిపోయే పాత్రల్లో జీవించారు. ఐదున్నర దశాబ్దాల కెరీర్‌లో నాలుగు భాషల్లో, నాలుగు తరాల నటులతో సినిమాలు చేసిన ఘనత చంద్రమోహన్‌ది. హీరోగా 175 సినిమాలు చేశారు. కెరీర్‌ మొత్తంలో 932 సినిమాలు చేశారు. ఈ విలక్షణ నటుడి పుట్టినరోజు నేడు (మే 23). 80 ఏళ్లు పూర్తి చేసుకుని, 81లోకి అడుగుపెడుతున్న చంద్రమోహన్‌ చెప్పిన విశేషాలు.

► కెరీర్‌లో స్థిరపడటం, ఆర్థిక స్థిరత్వం.. కెరీర్‌ తొలినాళ్లల్లో వీటిపైనే నా దృష్టి. ఈ రెండూ నెరవేరాక నేను కావాలని కోరుకున్న దర్శకుల కోసం సినిమాలు చేశాను.

►వినోదం పండించడం చాలా కష్టం. కమెడియన్‌కి గుర్తింపు రావాలంటే డైలాగుల్లో పంచ్‌ ఉండాలి. ప్రేక్షకుల నాడి తెలుసుకుని నటించాలి. అలాగే మరో సవాల్‌ ఏంటంటే.. వ్యక్తిగతంగా ఎలాంటి మూడ్‌లో ఉన్నా అది కెమెరా ముందు కనిపించనివ్వకూడదు. మరో కష్టం ఏంటంటే.. చేసినట్లే చేస్తే స్టేల్‌ అయ్యే ప్రమాదం ఉంది. కొత్తగా ప్రయత్నించాల్సి ఉంటుంది. కష్టమైన హాస్య పాత్రలను కూడా నేను పండించడానికి కారణం నా ఫ్యామిలీ. మా నాన్న, అక్కయ్యలు, తమ్ముడు, నేను.. మాకు మేం నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉంది.

►నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుని, ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’, ఇంకో సినిమాలో నెగటివ్‌ పాత్రలు చేశాను. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్‌ రౌండర్‌ అనిపించుకోవాలని గ్రహించాక అన్ని రకాల పాత్రలు చేయడం మొదలుపెట్టాను. హీరోగానే అనుకుని ఉంటే సినిమాల్లో 50 ఏళ్లకు పైగా ఉండగలిగేవాడిని కాదు.

►ఓ 50 ఏళ్లు నిర్విరామంగా సినిమాలు చేసిన నేను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. ఎవరైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో అంటే, ‘ఇనుముకు చెదలు పడుతుందా?’ అనేవాణ్ణి. ఆ నిర్లక్ష్యమే నా ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ‘రాఖీ’లో ఎమోషనల్‌ సీన్‌ చేసి, బైపాస్‌ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరాను. ‘దువ్వాడ జగన్నాథమ్‌’ అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోవడంతో షూటింగ్‌ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకున్నాను. అయితే టీవీలోనో, యూ ట్యూబ్‌లోనో నా సినిమాలు వస్తున్నాయి.æగతంలో కన్నా ఇప్పుడు ఫ్యాన్స్‌ ఎక్కువ కావడం ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా ఉంది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అయితే సినీజీవితం చాలా నేర్పించింది. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని నేర్పింది. చెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది.

వృత్తి జీవితంలో ఎలాంటి లోటు లేదు. వ్యక్తిగత జీవితం కూడా అంతే. నా భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. నాకు కోపం ఎక్కువ, ఆమెకు సహనం ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది నా కోపాన్ని తగ్గించడానికేనేమో అనిపిస్తుంటుంది. మా ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌. ఆమె భర్త బ్రహ్మ అశోక్‌ ఫార్మాసిస్ట్‌. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలో ఉంటున్నారు. 


చంద్రమోహన్‌ సినిమాల్లో ఆయనకు నచ్చిన 30 పాటలు.
1. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ 2. మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి  3. మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు  4. కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం  5. మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ  6. లేత చలిగాలులు– మూడు ముళ్లు 7. దాసోహం దాసోహం – పెళ్లి చూపులు 8. సామజవరాగమనా – శంకరాభరణం 9. ఈ తరుణము – ఇంటింటి రామాయణం  10. ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి  11. పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు  12. నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి  13. పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి 14. కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం 15. ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే 16. బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం 17. నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు 18. చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు  19. నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం  20. వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం  21. అటు గంటల మోతల – బాంధవ్యాలు  22. ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు  23. ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య  24. ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం  25. ఏమని పిలవాలి – భువనేశ్వరి  26. మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు  27. పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి  28. ఐ లవ్‌ యు సుజాత– గోపాల్‌ రావ్‌ గారి అమ్మాయి 29. నీ తీయని పెదవులు– కాంచనగంగ 30. నీ చూపులు గారడీ– అమాయకురాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement