
ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) అనే అంశం చాలా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సినీ తారలు ఇప్పుడిప్పుడే బహిరంగంగా మాట్లాడుతున్నారు. తమకు ఎదురైన ఛేదు అనుభవాలను పంచుకుంటూ.. వాటిని ఎలా అధిగమించాలో కొత్తతరం నటీనటులకు సలహాలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సయామీ ఖేర్(Saiyami Kher) కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. తన కెరీర్ ఆరంభంలో ఓ తెలుగు సినిమా అవకాశం కోసం ‘సర్దుకుపోవాలని’ అడిగారని, దానికి ఆమె నో చెప్పి.. ఆ సినిమాను వదిలేశానని చెప్పారు.
తాజాగా సయామీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పటి వరకు వచ్చిన ఆఫర్ల విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మంచి సినిమాల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అయితే నా కెరీర్ ఆరంభంలో మాత్రం నాకొక ఛేదు అనుభవం ఎదురైంది. నాకు 19-20 ఏళ్ల వయసులో ఓ తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. ఒక లేడీ ఏజెంట్ నన్ను పిలిచి సినిమా చాన్స్‌ల కోసం ‘సర్దుకుపోవాలి’ అని చెప్పారు. నేను ఆమెను టెస్ట్ చేయడానికి ప్రయత్నించాను. ఆమె మాటలు అర్థం కానట్లుగా నటించాను. కానీ ఆమె పదే పదే అదే విషయం ప్రస్తావించడంతో ‘క్షమించండి, నేను అలాంటి పనులకు దూరంగా ఉంటాను. నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని ఎప్పటికీ దాటలేను’ అని సున్నితంగా తిరస్కరించాను. అయితే ఆ సమయంలో ఈ విషయాన్ని బయట పెట్టేంత ధైర్యం నాకు లేదు. అందుకే ఆ సినిమాను వదిలేసి నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. నా కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే ‘కమిట్‌మెంట్’ లాంటి ఛేదు ఘటన ఎదురైంది’ అని సయామీ చెప్పుకొచ్చింది.
సయామీ ఖేర్ కెరీర్ విషయానికొస్తే.. 2015లో ‘రేయ్’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తీసిన 'మిర్జ్యా' చిత్రంతో సయామి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.'చోక్డ్' 'ఘూమర్' వంటి చిత్రాలతో పాటు 'స్పెషల్ ఆప్స్', 'ఫాదూ' వంటి వెబ్ సిరీస్‌లు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. 2021లో అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన 'వైల్డ్ డాగ్' మూవీలో సయామీ కీలక పాత్ర పోషించారు. ఇటీవల రిలీజైన'జాట్' సినిమాలో ఎస్సై పాత్రలో కనిపించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్త్నునారు.