ఒక్క మెసేజ్‌తో ఇద్దరు చిన్నారులను ఆదుకున్న సాయిధరమ్‌ తేజ్‌ | Sakshi
Sakshi News home page

ఒక్క మెసేజ్‌తో ఇద్దరు చిన్నారులను ఆదుకున్న సాయిధరమ్‌ తేజ్‌

Published Sat, Feb 24 2024 7:56 AM

Sai Dharam Tej Helped Two Children - Sakshi

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నారులకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తనకు యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసింది అని చెప్పిన ఆయన ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూనే.. సోషల్‌ సర్వీసులో కూడా ముందుంటాడు. తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఓ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారులకు అవసరమైన వైద్య ఖర్చులను ఆయన చెల్లించారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు సోషల్‌మీడియా వేదికగా తెలిపారు.

సూర్యాపేట జిల్లాలోని చార్లెట్‌ అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లల ట్రీట్‌మెంట్‌ కోసం సాయం కోరుతూ తనకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందని సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు తెలిపారు. వారికి సాయం అందించాలంటే తనకు వెంటనే గుర్తుకు వచ్చిన పేరు సాయిధరమ్‌ తేజ్‌ మాత్రమే అని ఆయనకు ఒక్క మెసేజ్‌ చేస్తే.. వెంటనే ఆ పిల్లలకు ఆయన సాయం చేశారని ఆండ్రూ తన సోషల్‌ మీడియా ద్వారా చెప్పాడు. సాయిధరమ్ చేసిన సాయానికి ఒక వీడియో ద్వారా ఆ పిల్లలు కృతజ్ఞతలు చెప్పారు.

గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు. తన పుట్టినరోజు సందర్భంగా‌ గతేడాది అక్టోబరులో సైనిక కుటుంబాలతో పాటు ఏపీ, తెలంగాణ పోలీసులకు రూ.20 లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇలా పలు సందర్భాల్లో తన వంతు సాయం చేస్తూ మనసు చాటుకున్నారు.  బ్రో, విరూపాక్షలతో మెప్పించిన సాయిధరమ్‌ ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో  'గాంజా శంకర్'చేస్తున్నారు. కానీ గాంజా అనే పదాన్ని తొలగించాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement