తమిళనాడులో ఒక వర్గం దైవంగా భావించే నాయకుడు పసుమ్‌పొన్ ముత్తురామలింగదేవర్. సామాజిక సేవకుడిగా పేరు గాంచిన ఈయన తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా పేరొందిన ముత్తురామలింగ దేవర్ పార్లమెంట్ సభ్యుడుగా దేశ రాజకీయాల్లోనూ రాణించారు. బ్రిటిష్ కాలంలోనే గాంధీజీ అహింసా వాదాన్ని వ్యతిరేకించి సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాన్ని ఆచరించి ఆయనతో పయనించారు.
అలా సుభాష్‌చంద్రబోస్‌తో పాటు నిషేధాని ఎదుర్కొన్న నాయకుడు ముత్తురామలింగ దేవర్. తమిళనాడులో 1953 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి కామరాజ్‌ను రాజకీయ నాయకుడిని చేసిన ఘనత ఇతనిది. ఆ తరువాత విభేదాలు కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ప్రాతినిథ్యం వహించి ముత్తురామలింగదేవర్ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ నిర్ణయాలనే విభేదించారు.
నేరారోపణలు కారణంగా జైలు జీవితాన్ని అనుభవించి, న్యాయ విచారణలో నిర్దోషిగా తిరిగొచ్చి ప్రజాసేవలోనే గడిపిన ఆయన ఆజన్మ బ్రహ్మచారి అన్నది విశేషం. తన ఆస్తిని తన అనుచరులకు పంచిన ఘనత ఇతనిది. అలాంటి ప్రజాసేవకుడు పసుమ్‌పొన్ ముత్తురామలింగ దేవర్ జీవిత చరిత్ర ఇప్పుడు దేశీయ తలైవన్ పేరుతో చిత్రంగా రూపొందింది. ఎస్‌ఎస్‌ఆర్.సత్య పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఎస్‌ఆర్ సత్య నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.అరవింద్‌రాజ్ దర్శకత్వం వహించారు. ముత్తురామలింగ దేవర్ పాత్రలో బషీర్ నటించగా, దర్శకుడు భారతిరాజా, రాధారవి, వైగై చంద్రశేఖర్, ఎంఎస్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు అరవింద్‌రాజ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం దేవర్ 118వ జయంతి సందర్భంగా అక్టోమర్ 31న విడుదలైంది.


