మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌కు కేరళలోని పతనంతిట్ట జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ యజమానిపై కూడా ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో రోజ్ బ్రాండ్ రైస్‌తో చేసిన బిర్యానీ తిన్న వారందరూ ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దుల్కర్‌కు నోటీసులు జారీ చేశారు.
నివేదికల ప్రకారం.. 2025 డిసెంబర్ 3న కమిషన్ ముందు దుల్కర్ సల్మాన్ హాజరు కావాలని ఆదేశించబడింది. నటుడితో పాటు, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ మేనేజింగ్ డైరెక్టర్, మలబార్ బిర్యానీ అండ్ స్పైసెస్ జిల్లా మేనేజర్‌ను కూడా హాజరు కావాలని కోరింది.

సంఘటన ఎప్పుడు జరిగింది..?
2025 ఆగస్టు 24న ఈ ఘటన జరిగింది. పతనంతిట్ట జిల్లా వల్లికోడ్‌కు చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ పి.ఎన్. జయరాజన్ చేసిన ఫిర్యాదుతో దుల్కర్‌పై కేసు నమోదు చేశారు. వల్లికోడ్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ కోసం బిర్యానీ తయారు చేయడానికి 50 కేజీల రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్‌ను ఆయన కొనుగోలు చేశాడు. ఆ వంటకం తిన్న చాలా మందికి ఫుడ్ పాయిజనింగ్ కావడం వల్ల వాంతులు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
అయితే, బియ్యం సంచులపై ప్యాకింగ్ తేదీతో పాటు గడువు తేదీ కూడా ముద్రించి లేదని గుర్తించినట్లు చెప్పారు. దీంతో ఆహార ఉత్పత్తి భద్రత చట్టప్రకారం ఆ కంపెనీ లేబులింగ్ ప్రమాణాలను పాటించలేదని జయరాజన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎ.కె. ట్రేడర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మొదటి నిందితుడిగా, మలబార్ బిర్యానీ స్పైస్ పతనంతిట్ట మేనేజర్ రెండవ నిందితుడిగా, బ్రాండ్ అంబాసిడర్ దుల్కర్ సల్మాన్ మూడవ నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతానికి, దుల్కర్ సల్మాన్, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ ప్రతినిధుల నుంచి నోటీసుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


