
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వీర చంద్రహాస మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన రవి తనకు సాయం చేసిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి అండగా నిలిచారు. అందుకే ఆయన పేరును పెట్టుకున్నానని తెలిపారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చింది మాత్రం ప్రశాంత్ నీల్ అన్నారు.
రవి బస్రూర్ మాట్లాడుతూ.. ఎనిమిదో తరగతి ఫెయిల్ అయినా నాలో సంగీత దర్శకుడిని గుర్తించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నాపై నమ్మకంతో ఉగ్రం సినిమాలో అవకాశమిచ్చారు. అప్పటికే నా లైఫ్ అంతా గందరగోళంగా ఉంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి ఆర్థిక సాయం చేశారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. లేకుంటే ఉండేవాడిని కాదు. అందుకే కృతజ్ఞతగా నా పేరును రవి అని పెట్టుకున్నా. వృత్తిపరంగా నన్ను గుర్తించి అవకాశమిచ్చిన ప్రశాంత్ నీల్ నాకు దైవంతో సమానం. నా సంపాదనతో వచ్చిన డబ్బులతో ఏడాది ఒక సినిమా తీయాలని అనుకున్నా. అందుకే వీర చంద్రహాస తెరకెక్కించా. ఇది నా 12 ఏళ్ల కల’’ అని అన్నారు.
కాగా.. వీర చంద్రహాస చిత్రం ఇప్పటికే కన్నడలో రిలీజైంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 19న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. కేజీఎఫ్ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన రవి బస్రూర్ నిర్మాతగా మారారు. ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్- నీల్ కాంబోలో వస్తోన్న మూవీకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు రవి బస్రూర్.