 
													టైటిల్: కర్మణ్యే వాధికారస్తే
నటీనటులు: బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్ తదితరులు
నిర్మాణ సంస్థ: ఉషస్విని ఫిలిమ్స్
నిర్మాత: డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్
దర్శకత్వం: అమర్ దీప్ చల్లపల్లి
సంగీతం: గ్యాని
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: భాస్కర్ సామల
విడుదల తేది: అక్టోబర్ 31, 2029
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’(karmanye Vadhikaraste ). సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
మూడు డిఫరెంట్ కేసుల చుట్టు తిరిగే కథ ఇది. సినీస్టార్ పృథ్వీ(పృథ్వీ) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మరణిస్తాడు. ఈ కేసును ఏసీపీ అర్జున్ (శత్రు) విచారిస్తుంటాడు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. దీంతో ఆ వ్యక్తి గురించి ఆరా తీయగా.. ఫేక్ అడ్రస్‌తో ఆధార్ సృష్టించుకొని నగరానికి వచ్చినట్లుగా గుర్తిస్తాడు. అలాంటి కేసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో కూడా నమోదు అవుతాయి. వాటి వెనుక ఎవరు ఉన్నారనే దిశగా అర్జున్ విచారిస్తుంటాడు. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుంటాయి. యాడ్ ఫిల్మ్‌మేకర్ జై(మాస్టర్ మహేంద్ర) అమ్మాయిలను ట్రాప్ చేసి, శారీరకంగా వాడుకొని హత్యలు చేస్తుంటాడు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు కోసం స్పెషల్ టీమ్ బరిలోకి దిగి విచారణ ప్రారంభిస్తుంది. 
ఇంకోవైపు సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ కీరిటీ(బ్రహ్మాజీ).. చెక్‌పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలిక కనిపిస్తుంది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి, పరీక్షలు చేయించగా.. అత్యాచారానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఆమెను కొంతమంది గ్యాంగ్ రేప్ చేశారని డాక్టర్ చెబుతారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు.. అ బాలికను తన ఇంట్లోని ఉంచుకొని చికిత్స అందిస్తుంటాడు. వేర్వేరుగా జరిగిన ఈ మూడు కేసుల వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేశారు? ఆపరేషన్ జిస్మత్ మ్యాటరేంటి? జిష్ణు ఎవరు? హానీట్రాప్కి పాల్పడిందెరు? ఎందుకు చేశారు? ఫిల్మ్‌మేకర్ జైకి జిష్ణుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్. స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్‌లు.. ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమర్ దీప్. ఇటీవల ఎక్కువ నమోదు అవుతున్న హానీట్రాప్ కేసుని ఇందులో చక్కగా చూపించారు.  
మూడు డిఫరెంట్ కేసులు..వాటి వెనుక ఎవరో ఒకరు ఉన్నారనే విషయం తెలిసినా.. ఆ ఒకరు ఎవరనేది మాత్రం ఎండింగ్ వరకు తెలియకుండా దర్శకుడు సెస్పెన్స్ మెంటేన్ చేశారు. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే.. అసలు కథ అర్థమవుతుంది. ఫస్టాఫ్ మొత్తం మూడు కేసులు..విచారణ చుట్టునే తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో మూడు కేసుల వెనుక ఉన్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అనేది చూపించారు.
నిత్యం వార్తల్లో చూస్తున్న కొన్ని బర్నింగ్ ఇష్యూస్‌ని ఇందులో చూపించారు. ఓ పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాప్‌లో గందరగోళంగా అనిపించిన సన్నివేశాలకు సెకండాఫ్‌లో జస్టిఫికేషన్ ఇచ్చారు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. 
ఎవరెలా చేశారంటే.. 
ఏసీపీ అర్జున్‌గా శత్రు చక్కగా నటించాడు. పలు సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో కనిపించిన శత్రు..ఇందులో హీరోగా నటించి మెప్పించాడు. ఆయన పర్సనాలిటీకి ఏసీపీ అర్జున్ పాత్ర కరెక్ట్‌గా సెట్ అయింది. యాడ్ ఫిల్మ్‌మేకర్ జైగా మాస్టర్ మహేంద్ర తనదైన నటనతో మెప్పించాడు. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. బ్రహ్మాజీ చాలా రోజుల తర్వాత మరోసారి పోలీసు పాత్రలో కనిపించాడు. ఆయన పాత్ర చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
