యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తొలి సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’తోనే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. అందులో ఒక నటుడు లతీష్. తిమ్మరాజుపల్లి టీవీలో విలన్ సిద్ధయ్య పాత్రలో నటించి..ఆకట్టుకున్నాడు. తొలి మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటున్నాడు లతీష్. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. తన సినీ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
→ నగరిలో మాది వ్యవసాయ కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి.అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి నన్ను చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమా చూసి, అందులో నా పర్ఫామెన్స్ చూసి మాట్లాడాడు.
→ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు బెంగళూరులో ఉద్యోగం చేశా. 2017లో హైదరాబాద్‌కి వచ్చాను. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. అందరూ నా యాక్టింగ్ బాగానే ఉందని అంటూ చెప్పారు. కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. మహిపాల్ వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ టైంలో యూట్యూబ్‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. మళ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేశాను.
→ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలో కెమెరా కొనేందుకు ఇంట్లో వాళ్లనే డబ్బులు అడిగాను. నిర్మించేందుకు డబ్బులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. నాకు ఏ అసోసియేషన్‌లోనూ మెంబర్ షిప్ లేదు. వేరే డైరెక్టర్ మీద ఆ కథను రిజిష్టర్ చేయించాను. నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు. ఆ తరువాత నేను డా. షేక్ జాన్ బషీర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను.
→ తిమ్మరాజుపల్లిలో నాది విలన్ పాత్ర అనగానే.. ఒకప్పుడు విలన్‌గా నటించి తర్వాత హీరోలు అయిన నటులంతా గుర్తుకు వచ్చారు. సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ కోసం వెయిట్ పెరిగాను. ఏకంగా ముప్పై కిలోలు పెరిగి ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయా. సిద్దయ్య పాత్రకు సరిపోవాలని చాలా శ్రమించాను. సినిమా చూసిన వారంతా అది నువ్వేనా? అని అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది.
→ కిరణ్ అబ్బవరం అన్న సినిమా చూసిన తరువాత టీం అందరినీ మెచ్చుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా ప్రదీప్ అన్నని, నన్ను ఎంతో ప్రశంసించారు. బయట ఇంత సైలెన్స్‌గా ఉన్నావ్.. స్క్రీన్ మీద అలా కనిపించావ్ ఏంట్రా అని ఆశ్చర్యపోయారు. అద్భుతంగా చేశావ్ అని కిరణ్ అన్న మెచ్చుకున్నారు. నరేష్ అగస్త్య కూడా చాలా పొగిడారు. మా బషీర్ సార్ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. నలుగురు శిష్యులు ఒకే సినిమాలో నటించడంతో బషీర్ సార్ కూడా సంతోషించారు. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లిన తరువాత నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను.
→ ప్రస్తుతం బీ స్టూడియోలో పార్ట్ టైంగా పని చేస్తున్నాను. చాలా మంది నుంచి ఫోన్స్ వస్తున్నాయి. చాలా కథలు వింటున్నాను. కానీ ఇంత వరకు ఏదీ క్లారిటీ రాలేదు. త్వరలోనే అన్నీ ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి.


