పిల్ల తెమ్మెర... హోరు గాలి ఆశా భోస్లే స్వరం! | Asha Bhosle Birthday Special: Timeless Journey of the Melody Queen | Sakshi
Sakshi News home page

Asha Bhosle: పిల్ల తెమ్మెర... హోరు గాలి ఆశా భోస్లే స్వరం!

Sep 8 2025 2:41 PM | Updated on Sep 8 2025 2:52 PM

Indian playback singer Asha Bhosle Birthday Special Story

'ఓ హసీన్‌దర్ద్‌దేదో జిసే మై గలే లగా లూ' అంటారు ఆశా భోస్లే ఓ పాటలో.  ఆ పాట సందర్భం ఏదైనా ‘హసీన్ దర్ద్‌’ అనే మాట ఎంత బావుందో కదా. అది ఆశాజీ స్వరానికి చక్కగా సరిపోతుంది. ఆవిడ తన పాటతో మనందరికి అలాంటి అందమైన బాధనే కదా పుట్టిస్తారు. ఇంకో పాటలో 'దిల్‌చీజ్‌క్యా హై ఆప్‌మేరీ జాన్‌లీజియే' అంటారు. నిజమే ఆవిడ గొంతుక అంటే పడి చచ్చేవాళ్లంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఇది మీ కోసం మా గుండెలే కాదు ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని! ఈ పాట ఆశ పాడిన గొప్ప పాటల్లో ఒకటి. షహరయార్ రచన, ఖయ్యాం సంగీతం, రేఖ అభినయం ఒక ఎత్తు అయితే ఆశా భోంస్లే స్వరం ఒక్కటే ఒక ఎత్తు. అందుకే ఈ పాట ఆశాజీకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. దీంతో పాటు ఆవిడ మరో పాటకు కూడా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పాట చాలా విలక్షణమైనది సాహిత్యపరంగా, సంగీతపరంగాను!

అదే 'మేరా కుఛ్‌ సామాన్‌... తుమ్హారే పాస్‌ పడా హై' సాంగ్‌ గుల్జార్ దర్శకత్వం వహించిన ఇజాజత్ సినిమాలోనిది. ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారని వేరే చెప్పాలా? ఇజాజత్‌ 1987లో రిలీజైంది. ఆర్డీ బర్మన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఓరోజు గుల్జార్ ఒక పాటకి లిరిక్స్ రాసి రికార్డింగ్‌కి పట్టుకెళ్లారు. ఆ లిరిక్స్ చూసి బర్మన్ దా ఇది పాట సాహిత్యమా లేక న్యూస్ పేపరా అని అడిగారు. గుల్జార్ మౌనంగా ఉండిపోయారు. ఆ పాట పాడాల్సిన ఆశా భోస్లే లిరిక్స్ చేతికి తీసుకుని మెల్లగా హమ్ చేస్తూపోయారు. అది వింటున్న బర్మన్ దాకి ఏదో స్ఫురించింది. అంతే! పదిహేను నిముషాల్లో బాణీ కట్టేశారు. అలా పుట్టిందే మేరా కుఛ్ సామాన్‌ అనే పాట!


ఈ పాట లిరిక్స్‌నిజంగానే పైకి ప్లెయిన్‌గా కనిపిస్తాయి. కానీ తరచి చూస్తే ఆ పదాల్లో ఎంతటి అర్థం దాగుందో తెలుస్తుంది. సుతిమెత్తగా ఉన్నట్లు కనిపించినా ఈ పాట బాణీ చాలా కష్టమైంది. ఆలాపన మొదలుకొని చివరి దాకా ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది. పల్లవి, చరణం లాంటి సంప్రదాయ పద్ధతులు కనిపించవు. ఈ పాట పాడ్డం అప్పట్లో ఆశా భోస్లేకి పెద్ద సవాలుగా తోచింది. మాధుర్యం చెడకుండా మంద్రస్థాయి నుంచి తారస్థాయికి.. అక్కడి నుంచి మళ్లీ మధ్యమస్థాయి, మంద్రస్థాయులకు ప్రయాణిస్తూ ఆశా ఈ పాటకు పూర్తి న్యాయం చేశారు. మధ్యమధ్యలో మాటలు, విరక్తి నవ్వులు కూడా వినిపించారు. ఇంత బాగా పాడినందుకు ఆవిడకు, అంత విభిన్నంగా రాసినందుకు గుల్జార్‌కి 1988 సంవత్సరానికిగాను జాతీయ అవార్డులు దక్కాయి. ఈ పాట విన్నప్పుడల్లా ఆర్డీ బర్మన్‌తో గడిపిన రోజులే గుర్తొస్తాయని ఆశా భోస్లే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఈ పాటంటే ఆవిడకి ప్రాణమట!


1933లో సెప్టెంబర్‌ 8న పుట్టిన ఆశా భోస్లే అక్క లతా మంగేష్కర్‌సాయంతో సినిమాల్లో పాడడం మొదలుపెట్టినా తొందరలోనే తనకంటూ ఒక స్టైల్‌ క్రియేట్‌చేసుకున్నారు. మత్తుగా, గమ్మత్తుగా పలికే ఆమె స్వరానికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ఉంది. ‘ఆయియే మెహర్బాన్‌’ అంటూ ఒక పాటలో కవ్విస్తే ‘ఓ మేరే సోనారే’ అంటూ మరో పాటలో మురిపిస్తారు. ‘హరే రామ హరే కృష్ణ’లోని ‘దమ్‌మారో దమ్‌’ అనే రాక్ ‌నంబర్ ‌పాడినా ‘ఉమ్రావ్‌జాన్‌లోని ‘ఇన్‌ఆంఖోంకీ మస్తీ కే’ అనే ఘజల్‌ ఆలపించినా ఆశా స్టైల్‌ దేనికదే ప్రత్యేకం.  


హెలెన్‌కోసం ‘పియా తూ అబ్‌తో ఆజా’ మొదలుకొని చాలా పాటలే పాడారూ ఆశాజీ. ఆ పాటలన్నీ ఎవర్‌గ్రీన్‌హిట్సే! ఏ మేరా దిల్ యార్‌కా దివానా, ఓ హసీనా జుల్ఫోవాలీ లాంటి డాన్స్‌నంబర్స్‌ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? 90స్ తర్వాత ఎ. ఆర్. రహమాన్‌ ఆశా భోస్లేకి మంచి హిట్స్ ఇచ్చారు. రంగీలా టైటిల్ సాంగ్, ‘తన్హా తన్హా’ పాటలు ఆవిడ వర్సటాలిటీకి అద్దం పడతాయి. ఇక 2001లో విడుదలైన ‘లగాన్‌’లోని ‘రాధ కైసే న జలే’ అనే పాటయితే జనం గుండెల్లో అలా నిలిచిపోయింది.


అన్నట్లూ ఆశాజీ మన తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చిన్ని కృష్ణుడు’ సినిమాలోని ‘జీవితం సప్త సాగర గీతం’ అన్న ఆర్డీ బర్మన్‌ కంపోజిషన్ ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. ఇక ‘చందమామ’ సినిమా కోసం కె.ఎం. రాధాకృష్ణన్‌పాడించిన ‘నాలో ఊహలకు’ అనే పాట ఎంత హాయిగా, లయబద్ధంగా సాగిపోతుందో వేరే చెప్పాలా?   ఆశా భోస్లే స్వరం మెత్తగా లాలించే పిల్ల తెమ్మెరే కాదు గుండెను పట్టి కుదిపేసే హోరుగాలి కూడా, మెల్లగా సాగే సెలయేరే కాదు, ఉవ్వెత్తున దూకే జలపాతం కూడా. ఆ స్వర ప్రవాహంలో తడిసి ముద్దవడం తప్ప సామాన్య శ్రోతలుగా మనమింకేం చేయగలం?

-శాంతి ఇశాన్‌ -(సెప్టెంబర్ 8 ఆశా భోస్లే పుట్టినరోజు సందర్భంగా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement