ఒక క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోందంటే ఆ అంచనాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. తమ కాంబినేషన్‌లోని మొదటి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హీరో–దర్శకుడుకొంత గ్యాప్ తర్వాత రెండో సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా గురించి ఇటు ఇండస్ట్రీ వర్గాలు, అటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగాఎదురు చూస్తుంటారు. అలా తాజాగా కొన్ని కాంబినేషన్స్‌పై అంచనాలు నెలకొన్నాయి. రిపీట్ అవుతున్న ఈ హిట్ కాంబినేషన్స్‌పై ఓ లుక్ వేయండి.
గోదావరి యాసతో...
గోదావరి యాసలో చిరంజీవి మాస్ డైలాగ్స్ చెబితే ఎలా ఉంటుంది? గోదావరి యాసలో చిరంజీవి కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ను ఎంత నవ్విస్తుంది? అన్నది వచ్చే ఏడాది థియేటర్స్‌లో చూడొచ్చు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి గోదావరి యాసలో మాట్లాడతారని తెలిసింది.
అలాగే కథలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని, ఈ ఎపిసోడ్ కోల్‌కతా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. అలాగే చిరంజీవి క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీకూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ఉంటుందని, చిరంజీవి, మలయాళ యువ నటి అనశ్వర రాజన్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారని తెలిసింది. చిరంజీవి భార్య పాత్రలో నివేతా పేతురాజ్ కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే పొల్లాచ్చి షూట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.
లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం చిరంజీవి పాల్గొంటుండగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తీస్తున్నారు మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారని తెలిసింది. ఈ సీక్వెన్స్ సినిమాలో ఇంట్రవెల్ ఎపిసోడ్‌గా వస్తుందని, ఈ ఇంట్రవెల్ బ్యాంగ్‌లో రివీల్ అయ్యే ఓ ట్విస్ట్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందనీ టాక్. ఈ సినిమా చిత్రీకరణను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి–కేఎస్ రవీంద్ర కాంబినేషన్‌లోని తొలి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతి సందర్భంగా రిలీజైన సంగతి తెలిసిందే.
బాంబే బ్యాక్‌డ్రాప్‌లో...
హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లోని రెండో సినిమా ‘ఎన్‌బీకే 111’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. 1993 బాంబేలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. డిసెంబరులో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ డిసెంబరు రిలీజ్ మిస్ అయితే, సంక్రాంతి బరిలో ఈ సినిమాని నిలపాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.
గాడ్ ఆఫ్ వార్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. 2018లో దసరా పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. 8 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. కానీ జానర్‌ను మార్చారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, సెంటిమెంట్, సందేశం అంశాల మేళవింపుతో వచ్చింది. కానీ వీరి కాంబినేషన్‌లోని తాజా సినిమా మైథాలజీ జానర్‌లో రానుంది. లార్డ్ కుమారస్వామి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట.
అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. తమిళ దర్శకుడు నెల్సన్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సింది. మరి...‘డ్రాగన్’ తర్వాత ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా సెట్స్‌కు వెళ్తుందా? లేక నెల్సన్‌తో సినిమాను పూర్తి చేసిన తర్వాతే ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా మొదలవుతుందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... కమల్‌హాసన్–రజనీకాంత్‌ల తాజా మల్టీస్టారర్ మూవీ కమిట్ అయ్యారు నెల్సన్. దీంతో ‘డ్రాగన్’ తర్వాత ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాను ఎన్టీఆర్ టేకప్ చేస్తారనే ఊహాగానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మళ్లీ విలేజ్ డ్రామా?
రామ్‌చరణ్ కెరీర్‌లో వన్నాఫ్ ది బిగ్టెస్ట్ హిట్స్‌లో ‘రంగస్థలం’ సినిమా ఒకటి. 2018లో విడుదలైన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. తాజాగా హీరో రామ్‌చరణ్– దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా ‘ఆర్‌సీ 17’ (వర్కింగ్ టైటిల్) రానుంది. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర అవుతోంది. కానీ ఇంకా సెట్స్‌కు వెళ్ల లేదు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణతో రామ్‌చరణ్ బిజీగా ఉండటమే ఇందుకు కారణం అని తెలిసిందే.
‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదలైంది. దీంతో ఇక సుకుమార్‌తో సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు రామ్‌చరణ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా జానర్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇదొక స్టైలిష్ యాక్షన్ డ్రామా అని కొందరు అంటుంటే, కాదు... ‘రంగస్థలం’లానే, ‘ఆర్‌సీ 17’ కూడా ఓ విలేజ్ డ్రామా అనే టాక్ వినిపిస్తోంది. మరి... ఈ సినిమాను సుకుమార్ ఏ జానర్‌లో తెరకెక్కించనున్నారు? అన్న అంశం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలని చూస్తోంది యూనిట్. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారు అంటూ సమంత, కృతి సనన్, కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవరూ ఫైనలైజ్ కాలేదు.
సికింద్రాబాద్ కుర్రాడు
నాని హీరోగా నటించిన హిట్ ఫిల్మ్ ‘దసరా’. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. 2023 మార్చిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. కయాదు లోహర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్ పాత్రధారులుగా మోహన్‌బాబు, బాలీవుడ్ యువ నటుడు రాఘవ్ జుయల్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాను మార్చి 26నే రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ క్వాలిటీ, కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ‘ది ప్యారడైజ్’ సినిమాను ఇటీవల ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ ఈ సినిమా ఈ తేదీన కూడా రిలీజ్ కావడం లేదని, సెప్టెంబరు చివర్లో రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ అధికారికంగా ఒక ప్రకటన చేయనున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ది ప్యారడైజ్’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.
రాయలసీమ యోధుడు
ఎనిమిది సంవత్సరాల తర్వాత కలిసి పని చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. విజయ్–రాహుల్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘టాక్సీవాలా’. 2018లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ‘రణబాలి’ చిత్రం కోసం మళ్లీ ఈ ఇద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో రాయలసీమలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రణబాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మికా మందన్నా, విలన్ సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయింది. టీ సిరీస్ ఫిలింస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 11న విడుదల కానుంది. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ– రష్మికా మందన్నా కాంబినేషన్‌లో రానున్న ఈ ‘రణబాలి’పై ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి.
ఫ్యామిలీ ప్యాక్
హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘సామజవరగమన’. 2023లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా మరో సినిమా చేస్తున్నారు శ్రీవిష్ణు, రామ్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుందట. ‘సామజవరగమన’ సినిమాకు రచయితలుగా పని చేసిన నందు, భాను, ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమాకూ వర్క్ చేస్తుండటం విశేషం.
నిజమేనా?
మహేశ్‌బాబు తాజా సినిమా ‘వారణాసి’. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. అయితే ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు సాన, అనిల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ‘వారణాసి’ వంటి హెవీ బడ్జెట్, లార్జర్ దేన్ లైఫ్ మూవీ తర్వాత మరో లైట్ హార్టెడ్ సినిమా చేయాలని మహేశ్‌బాబు అనుకుంటున్నారని, దీంతో ముందుగా అనిల్ రావిపూడికి మహేశ్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాకు మహేశ్‌బాబు చాన్స్ ఇస్తారనే ప్రచారం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే... ‘సరిలేరు నీకెవ్వరు’ కాంబో రిపీట్ అయినట్లే. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2020 సంక్రాంతి సందర్భంగా రిలీజైన ‘సరిలేరు నీకె వ్వరు’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి... ఆరు సంవత్సరాల తర్వాత మహేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
‘మజిలీ’ దర్శకుడితో మళ్లీ?
ప్రస్తుతం ‘వృషకర్మ’ చిత్రంతో బిజీగా ఉన్నారు నాగచైతన్య. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో 24వది. దీంతో తన కెరీర్‌లోని మైల్‌స్టోన్ మూవీ అయిన 25వ సినిమా కోసం కథలు వింటున్నారు నాగచైతన్య. శివ నిర్వాణ, బోయపాటి శ్రీను, క్లాక్స్, చిదంబరం వంటివారు నాగచైతన్యకు కథలు వినిపించారట. కానీ నాగచైతన్య ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఒకవేళ శివ నిర్వాణతో సినిమా చేయాలని నాగ చైతన్య ఫిక్స్ అయితే, ‘మజిలీ’ కాంబో మరోసారి సెట్ అయినట్లే అవుతుంది. నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘మజిలీ’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి... నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమా శివ నిర్వాణతోనే ఉంటుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
టాలీవుడ్‌లోనే కాదు... కోలీవుడ్‌లో కూడా హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. సూర్య హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన మంచి సందేశాత్మక చిత్రం ‘జై భీమ్’. 2021లో ఈ సినిమా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజై, వీక్షకుల మెప్పు పొందింది. తాజాగా ఈ కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతోంది. హీరో సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి చేయనున్న రెండో సినిమాను హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. దివంగత ప్రముఖ సామాజిక వైద్యుడు, ఐదు రూపాయల డాక్టర్‌గా మంచి పేరు పొందిన డాక్టర్ తిరువేంగడం వీరరాఘవన్ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
హీరో ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘కర్ణన్’. 2021లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. గత ఏడాది వీరి కాంబోలో మరో సినిమాను ప్రకటించారు. ధనుష్ కెరీర్‌లోని ఈ 56వ సినిమా చిత్రీకరణ మొదలైంది. కులవ్యవస్థ నిర్మూలన, రాజకీయ అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. వేల్స్ ఇంటర్‌నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
- ముసిమి శివాంజనేయులు


