
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా విడుదల తర్వాత నేటి యువత అందరూ ఆయన స్వగ్రామం గురించి ఆరా తీస్తున్నారు. పరమశివుడికి అత్యంత గొప్ప భక్తుడిగా చరిత్రలో నిలిచిపోయిన కన్నప్ప మన తెలుగు గడ్డపై జన్మించినట్లు ఆధారాలు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు అనే గ్రామమే కన్నప్ప స్వస్థలమని చెబుతారు. ఈ ఊరిలోనే స్వామి వారి విగ్రహానికి కన్నప్ప ప్రత్యేక పూజలు చేశారని, ఆయన ఇక్కడే నివాసం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో నిజం అని నిర్ధారించుకున్నారు. అక్కడ కన్నప్ప ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే భక్త కన్నప్ప విగ్రహంతో పాటు అన్నమాచార్యుల విగ్రహం కూడా ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. అది కన్నప్ప స్వగ్రామమే కాకుండా అన్నమయ్య అమ్మమ్మ ఊరు కూడా అదేనని చెబుతారు.
కన్నప్ప పేరు వినగానే ప్రతి భక్తుడికి గుర్తుకు వచ్చే అంశం తాను ఆరాధించే దైవానికి లోకాన్ని చూసే కళ్లనే తృణప్రాయంగా సమర్పించుకున్న భక్తి గాధ వినిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటుకూరును పూర్వం ఉడుప్వూరు అని పిలిచేవారని శాసనాల్లో ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన శేక్కిలారుముని రాసిన శివ భక్తుల చరిత్రలో కన్నప్ప ఊరి గురించి పేర్కొన్నారు. కన్నప్ప జన్మ స్థలం ఊటుకూరుగా వారు పేర్కొన్నారు. చాలామంది పరిశోధనలు చేసిన తర్వాత కన్నప్పది ఊటుకూరే అని నిర్ధారించారు. ఆయన 3102 BCE కాలానికి చెందిన వ్యక్తిగా వారు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం మంచు విష్ణు కూడా తన యూనిట్‌తో ఈ గ్రామంలో ఉన్న కన్నప్ప ఆలయాన్ని సందర్శించారు.