
యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టింది నటి గాయత్రి గుప్తా (Gayathri Gupta). తక్కువ కాలంలోనే సినిమాల్లోనూ కనిపించింది. ఫిదా, కొబ్బరిమట్ట, ఐస్‌క్రీమ్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల తర్వాత తనకు అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను బాల్యం నుంచి పడిన కష్టాలను ఏకరువు పెట్టింది. గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మానాన్నల ప్రేమ దక్కలేదు. ఏ అమ్మాయైనా తండ్రిలాంటి అబ్బాయే భర్తగా రావాలని కోరుకుంటుంది. కానీ, నా విషయంలో తండ్రే సరిగా లేడు.
కళ్లలో నిమ్మరసం
చీపురుతో, చెప్పులతో కొట్టేవాడు. టీవీకి ఉండే కాపర్ వైర్‌తో కొడితే నా చర్మం ఊడిపోయేది. ఆ ఊడిన చర్మం దగ్గర కారంపొడి వేసేవాడు. కళ్లలో నిమ్మకాయలు పిండేవాడు. 25 ఏళ్ల వరకు నేను దెబ్బలు తినని రోజు లేదు. ప్రతిరోజు ఏడ్చుకుంటూ పడుకునేదాన్ని. నాకు నలుగురు చెల్లెళ్లు. అందరికంటే అమ్మను, నన్ను ఎక్కువ కొట్టేవాడు. నిజానికి నాన్న చాలా రిచ్.. అయినా సరే నా ఇంజనీరింగ్‌లో రూ.100 పాకెట్‌మనీ ఇచ్చేవాడు. మళ్లీ అదెలా ఖర్చయిపోయాయని లెక్కలడిగేవాడు.

పేరెంట్స్ విడాకులు
నాన్న మగ సంతానం కోసం ఎదురుచూశాడు. అమ్మకు మూడు అబార్షన్లు కూడా అయ్యాయి. అయినా ఐదుగురం ఆడపిల్లలే పుట్టడంతో అమ్మపై హత్యాప్రయత్నం చేశాడు. ఆస్తి ఇవ్వకుండా విడాకులు తీసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకుంటే ఆమెకు కూడా అమ్మాయే పుట్టింది. సినిమాల విషయానికి వస్తే.. ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిచోటా నాకేంటి? అని అడుగుతున్నారు. గతంలో నేను నటించిన ఓ మూవీ ట్రైలర్ హిట్టయిందని పార్టీ ఏర్పాటు చేశారు.
బలవంతంగా మందు తాగించారు
నాకు మందు తాగడం ఇష్టముండదు. అయినా బలవంతంగా తాగిపించారు. ఎందుకైనా మంచిదని బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకునే పార్టీకి వెళ్లాను. కానీ తనకు ఊర్లో నుంచి ఫోన్ రావడంతో ఉన్నఫళంగా వెళ్లిపోయాడు. ఒక్కదాన్నే ఉన్నానని అర్థమై నిర్మాత నా డ్రెస్ లాగేందుకు ప్రయత్నించాడు. నేను అతడిని అడ్డుకున్నాను. గంటసేపు అతడిని నిలువరించాను. దీంతో ఆ నిర్మాత వర్కవుట్ అయ్యేలా లేదని నన్ను ఇంటికి పంపించేశాడు.

పదిరోజులు ఏడుస్తూనే..
ఏడుస్తూ ఇంటికెళ్లిపోయా.. ఇంతలో ఈవెంట్ మేనేజర్ వచ్చి నన్ను గలీజ్‌గా హత్తుకున్నాడు. ఇవన్నీ ఫేస్ చేశాక పదిరోజులు సరిగా తినలేదు, నిద్రపోలేదు. ఏడుస్తూనే ఉన్నాను. 2023లో ప్రియుడికి బ్రేకప్ చెప్పాను. నాకు యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది. ట్రీట్‌మెంట్‌కు రూ.15 లక్షలు కావాలి. క్రౌడ్ ఫండిగ్ ద్వారా రూ.2 లక్షలు సమకూరాయి. ఏం చేయాలో అర్థం కాలేదు.
సందీప్ రెడ్డి వంగా సాయంతోనే..
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నా స్నేహితుడు. ఫోన్ చేసి నా పరిస్థితిని వివరించాను. ఏడాదిగా బెడ్‌కే పరిమితమయ్యాను. అద్దె కూడా చెల్లించడం లేదని చెప్పాను. నా రిపోర్ట్స్ చూసి సందీప్.. వెంటనే ఐదున్నర లక్షలు పంపించాడు. ఆ డబ్బుతోనే చికిత్స మొదలుపెట్టాను. అయితే గతంలో నా పెళ్లి కూడా అయిపోయింది. పేరెంట్స్ విడాకులు తీసుకున్నప్పుడు అమ్మ నాకు బలవంతంగా పెళ్లి చేసింది.

అమ్మ నిజస్వరూపం ఇదీ!
ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను, వాళ్ల విధానాలు తేడాగా ఉన్నాయని వద్దని వారించాను. కానీ, అమ్మ.. విషం బాటిల్ ముందు పెట్టుకుని పెళ్లి చేసుకోకపోతే చస్తానని బెదిరించింది. లోలోపల కుములుతూనే పెళ్లి చేసుకున్నాను. అప్పగింతల సమయంలో మిస్ యూ అంటూ అమ్మ నన్ను హగ్ చేసుకుంది. ఆమె ప్రేమకు మురిసేలోపే.. చెవిలో నిన్ను వదిలించుకోవడానికే ఈ మ్యారేజ్ చేస్తున్నాను. మళ్లీ నా జీవితంలోకి రాకు, గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అంది. షాకైపోయాను.
రెండేళ్లు నరకం అనుభవించా..
అమ్మ అందరిముందు ఒకలా, సీక్రెట్‌గా ఒకలా ఎలా ఉంటుంది? అమ్మ గురించి ముందే తెలుసుంటే ఆ పెళ్లి చేసుకునేదాన్నే కాదు. ఆ వెడ్డింగ్ వల్ల రెండేళ్లు నరకం అనుభవించాను. భర్త నా జుట్టు పట్టుకుని గోడకేసి బాదేవాడు, రక్తం వచ్చినా పట్టించుకునేవాడు కాదు. అమ్మకు చెప్తే నువ్వు చచ్చినా నాకు సంబంధం లేదనేది. అప్పుడు నేను చనిపోవడానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో నాకు మూడు కుట్లు కూడా పడ్డాయి అని చెప్పుకొచ్చింది.
చదవండి: రాఖీ నుంచి దీపావళి వరకు.. పండగలే సినిమా టైటిల్స్ అయితే..!