శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేష్‌లకు కలైమామణి

2019 And 2020 Kalaimamani Award List Released - Sakshi

సాక్షి, చెన్నై: సినీ, నాటక, సంగీత, సాహితీ రంగాల్లో విశిష్ట సేవల్ని అందిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కలైమామణి అవార్డులను ప్రకటించింది. 2019, 2020 సంవత్సరానికిగాను ఈ అవార్డులకు ఎంపికైన వారి వివరాలను సమాచారశాఖ విడుదల చేసింది. ఇందులో సరోజాదేవి, పి సుశీల, షావుకారు జానకీలకు ప్రత్యేకంగా పురట్చి తలైవి జయలలిత కలైమామణి అవార్డులను ప్రకటించారు.  ప్రతి ఏటా పై రంగాల్లో విశిష్ట సేవల్ని అందిస్తున్న వారికి ప్రభుత్వం కలైమామణి అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. 2019కి సంబంధించిన జాబితా కరోనా పుణ్యమాని గత ఏడాది వెలువడలేదు.

దీంతో  2019తో పాటు 2020 సంవత్సరానికి కలైమామణి అవార్డులకు ఎంపికైన వారి వివరాలను శుక్రవారం రాత్రి ప్రకటించారు. సినీ, నాటక రంగం, సాహితీ రంగం, బుల్లి తెర అంటూ విశిష్ట సేవల్ని అందించిన కళామ్మతల్లి బిడ్డలకు కలైమామణి అవార్డులను ప్రకటించారు. అలాగే పురట్చి తలైవి జయలిత పేరిట ప్రత్యేక కలైమామణి అవార్డు, భారతీ, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి, బాల సరస్వతి, సీనియర్‌ కలైమామణి బిరుదలకు ఎంపికైన వారి వివరాలతో ఈ జాబితాను ప్రకటించారు. ఇందులో సీని రంగానికి చెందిన 41 మంది ఇందులో ఉన్నారు.  

2019.. 
సినీనటుడు– రామరాజన్, సంగీత దర్శకుడు– దీన, దర్శకుడు–  లియాఖత్‌ అలీ ఖాన్, హాస్య నటుడు యోగిబాబు, హాస్యనటి దేవ దర్శిని, పాట రచయిత కామకోడియన్,  కెమెరా మ్యాన్‌ – రఘునాథ్‌ రెడ్డి,  నేపథ్య గాయకుడు– ఆనంద్, నేపథ్య గాయని– సుజాత, నిర్మాత – కలైపులి ఎస్‌ థాను, ఎడిటర్‌ – ఆంటోని, కాస్ట్యూమ్స్‌ – రాజేంద్రన్, స్టంట్‌ – దినేష్‌, నృత్యదర్శకుడు – శివశంకర్, దర్శకుడు మనోజ్‌కుమార్‌. అలాగే, ఈ సంవత్సరానికి గాను పురట్చి తలైవి జే జయలలిత ప్రత్యేక కలైమామణి అవార్డులకు సీనియర్‌ నటి సరోజా దేవి, ప్రముఖ నేపథ్యగాయని పి సుశీల, నృత్య రంగానికి అంబికా కామేశ్వర్‌ ఎంపికయ్యారు.  

2020... 
నటుడు – శివకార్తికేయన్, నటి ఐశ్వర్య రాజేష్‌, సంగీత దర్శకుడు – ఇమాన్, పాటల రచయిత –కాదల్‌ మది, హాస్యనటి – మధుమిత, నిర్మాత  – ఐషరీ గణేష్‌, మాటల రచయిత – ప్రభాకర్, స్టంట్‌ జాగ్వర్‌– తంగం, నృత్యదర్శకుడు– శ్రీథర్, క్యారెక్టర్‌ ఆరిస్టు – సంగీత, దర్శకుడు– గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్,  నటుడు, దర్శకుడు ఎస్‌.రవి మరియ ఉన్నారు. ఈ సంవత్సరం పురట్చి తలైవి జే జయలలిత కలైమామణి అవార్డుకు సీనియర్‌ నటి షావుకారు జానకి, సంగీతం– జమునారాణి, నాట్యరంగం– పార్వతి రవి ఘంటసాల ఎంపికయ్యారు. ఈ అవార్డులకు ఎంపికైన కళాకారుల్ని అభినందిస్తూ తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top