రిస్క్‌ వద్దు.. పెంట పెట్టుకోవద్దుని హెచ్చరించారు: ఆమిర్‌ ఖాన్‌

20 Years Of Lagaan: When KJ And Aditya Chopra Warned Aamir Khan - Sakshi

వెబ్‌డెస్క్‌: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్లలో ‘లగాన్‌’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అశుతోశ్‌ గోవరికర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లగాన్‌కు మొత్తంగా ఎనిమిది జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్‌ కొరియోగ్రఫీ, బెస్ట్‌ ఆడియోగ్రఫీ, బెస్ట్‌ లిరిసిస్ట్‌, బెస్ట్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ ఇలా పలు విభాగాల్లో పురస్కారాలు లభించాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొత్తంగా 650 మిలియన్‌ రూపాయలు వసూలు చేసినట్లు సినీ పండితుల విశ్లేషణ. భారతీయ సినీ చరిత్రలో ఐకానిక్‌గా నిలిచే సినిమాల్లో ఒకటైన లగాన్‌ విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్లు.

ఈ సందర్భంగా.. పీటీఐతో మాట్లాడిన ఆమిర్‌ ఖాన్‌ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. లగాన్‌ సినిమా సమయంలో దర్శక నిర్మాతలు కరణ్‌ జోహార్‌, ఆదిత్య చోప్రా తనకు ఇచ్చిన సలహాలు కాదని మరీ ముందడుగు వేశానని చెప్పుకొచ్చాడు. ‘‘లగాన్‌ అవుట్‌డోర్‌ షూటింగ్‌ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు కరణ్‌ జోహార్‌, ఆదిని ఓ పార్టీలో కలిశాను. వాళ్లేం చెప్పారో నాకింకా గుర్తుంది. ‘‘జీవితంలో పెద్ద తప్పు చేస్తున్నావు. సింగిల్‌ షెడ్యూల్‌ అసలే వద్దు. రిస్క్‌ తీసుకోవద్దు. పెంట పెట్టుకోవద్దు’’ అని నన్ను హెచ్చరించారు. కానీ నేను నమ్మకంగా ముందుకు సాగాను’’ అని ఆమిర్‌ పేర్కొన్నాడు. నటుడిగా, నిర్మాతగా తను ధైర్యంగా తీసుకున్న నిర్ణయం కెరీర్‌నే మలుపు తిప్పిందని హర్షం వ్యక్తం చేశాడు. 

లైఫ్‌ పార్ట్‌నర్‌ కూడా దొరికింది..
అదే విధంగా.. ‘‘ నిర్మాతగా లగాన్‌తో నిర్మాణ బాధ్యతలు చేపట్టడం, సింక్‌ సౌండ్‌ రికార్డింగ్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విధానం ప్రవేశపెట్టడం వంటివి నాకు ఎంతో తృప్తినిచ్చాయి. నిజానికి అశుతోశ్‌ కథ చెప్పినపుడే ఇదొక సంక్లిష్టమైన సినిమా అని అనిపించింది. అయినప్పటికీ అశుతోశ్‌ పట్టుదల వీడలేదు. మళ్లీ మళ్లీ నాతో చర్చించి ఒప్పించాడు. అదే మంచిదైంది. సినిమా సంప్రదాయాలన్నెంటినో మేం బ్రేక్‌ చేశాం’’ అని ఆమిర్‌ పేర్కొన్నాడు.

ఇక కెరీర్‌పరంగానూ, వ్యక్తిగతంగానూ ఆమిర్‌ జీవితంలో లగాన్‌కు ప్రత్యేక స్థానం ఉండటానికి మరో కారణం కిరణ్‌ రావు. ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమెతో ప్రేమలో పడిన ఆమిర్‌.. కొన్నాళ్ల తర్వాత ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ఆజాద్‌(సరోగసీ ద్వారా జన్మించాడు) సంతానం. ఇక కిరణ్‌ రావు మరెవరో కాదు.. హీరోయిన్‌ అతిథి రావు హైదరీకి కజిన్‌. వీరిద్దరి పూర్వీకులు గద్వాల్‌ సంస్థానాని(వనపర్తి- తెలంగాణ)కి చెందిన వారు. 

క్రికెట్‌ నేపథ్యంలో..
స్వాతంత్య్రానికి ముందు మధ్య భారతదేశంలోని కరువుతో అల్లాడుతున్న ఓ చిన్న గ్రామంలోని పరిస్థితుల చుట్టూ అల్లుకున్న కథే లగాన్‌. పన్నుల కోసం తమను వేధిస్తున్న బ్రిటీష్‌ అధికారులతో సవాల్‌ చేసి క్రికెట్‌ ఆడి అధిక పన్ను భారం నుంచి విముక్తి పొందేందుకు గ్రామస్తులు చేసే పోరాటం ఇతివృత్తంగా సినిమా సాగుతుంది. తమకు అసలు పరిచయం లేని ఆటను నేర్చుకుని.. తమ తలరాతను తామే మార్చుకున్న విధానం ఆకట్టుకుంటుంది. ఆమిర్‌ఖాన్‌, గ్రేసీ సింగ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నేటికీ లక్షలాది మంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మ్యూజికల్‌గానూ హిట్టయిన ఈ సినిమా పాటలు సంగీత ప్రియుల మనసు చూరగొంటూనే ఉన్నాయి.

చదవండి: రజనీకాంత్‌ ‘శివాజీ’ మూవీకీ 14 ఏళ్లు: అప్పటి కలెక్షన్స్‌ ఎంతంటే..  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top