రేగోడ్(మెదక్): ఎస్టీయూ మండల శాఖ అధ్యక్షుడుగా ఆదిత్యగౌడ్‌ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రిషికాంత్, మహిళా ఉపాధ్యక్షురాలిగా అనూష, ప్రధాన కార్యదర్శిగా నరేశ్, కార్యదర్శులుగా మహేందర్, పుష్పలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆదిత్యగౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఉన్నతమైన బాధ్యతలను అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నిరాహార దీక్షను విజయవంతం చేయండి
నర్సాపూర్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కుమార్ కోరారు. ఈ నెల 30న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే నిరాహార దీక్ష కరపత్రాలను కుమార్ తదితరులు ఆవిష్కరించి మాట్లాడారు. దళితులకు పలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అమలు చేయకుండా జాప్యం చేస్తూ మోసం చేస్తుందని ఆరోపించారు. హామీల అమలుకు డిమాండ్‌తో చేపట్టిన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కుమార్ కోరారు. ఆయన వెంట నాయకులు నాగరాజు, విద్యాసాగర్, నరేష్ తదితరులు ఉన్నారు.
ఇసుక కుప్పలు సీజ్
పాపన్నపేట(మెదక్): కొడుపాక గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన 15 ట్రాక్టర్ల ఇసుకను శుక్రవారం రాత్రి సీజ్ చేసినట్లు తహసీల్దార్ సతీష్ తెలిపారు. మంజీరా నది నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తీస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామన్నారు. అక్రమంగా ఇసుక తీస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
నేడు విద్యుత్ సరఫరా బంద్
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట, బూర్గుపల్లి 33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
విద్యార్థులపై తేనెటీగల దాడి
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం తేనెటీగలు ఒక్కసారిగా విద్యార్థులపై దాడి చేశాయి. ఈ మేరకు పాఠశాలకు పక్కనే ఉన్న చెట్లు మీద ఉన్న తేనేటీగల గుంపు ఒక్కసారి లేచి విద్యార్థి సాత్విక్‌పై దాడి చేయడంతో వెంటనే పాఠశాలలోకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యా యులు విద్యార్థులను గదుల్లోకి పంపి తలు పులు వేసి ప్రమాదం నుంచి తప్పించారు. ఈగలకు మంట పెట్టి దూరంగా పంపించారు. విద్యార్థికి స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పాఠశాల కొనసాగింది.
ఆశావర్కర్ల ముందస్తు అరెస్ట్
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని స్థానిక పోలీసులు శనివారం ఆశావర్కర్లను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ చలో అసెంబీకి బయలుదేరిన ఆశావర్కర్లను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రేపు కంటి వైద్యశిబిరం
పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమ వారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రిటైర్డు ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు ఎస్.నర్సింలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో ఉద్యోగులతో పాటు రిటైర్డు ఉద్యోగులు, ఆరోగ్యశ్రీకార్డు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


