హస్తం హవా..
మెదక్, రామాయంపేట, నర్సాపూర్ బల్దియాలు కాంగ్రెస్ కై వసం
● తూప్రాన్ మున్సిపాలిటీపై గులాబీ జెండా
● బీజేపీకి నర్సాపూర్ వైస్ చైర్‌పర్సన్ పదవి
● హంగ్ మున్సిపాలిటీల్లో చిత్ర విచిత్ర పొత్తులు
హంగ్ మున్సిపాలిటీల్లో
ఎన్నిక ఆసక్తికరం
జిల్లా కేంద్రం మెదక్ బల్దియాలో బీజేపీ కౌన్సిలర్ల పరోక్ష మద్దతుతో చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ పదవులను కాంగ్రెస్‌కు దక్కాయి. ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనకపోవడం, బీఎస్పీ నుంచి గెలిచిన కౌన్సిలర్ కాంగ్రెస్‌లో కలడం, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటుతో ఈ బల్దియాను వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. నర్సాపూర్‌లో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు కలిసి చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను పంచుకోవడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినందుకు బీజేపీకి వైస్ చైర్‌పర్సన్ పదవి దక్కింది. హంగ్ ఫలితాలు వచ్చిన రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాల ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. మెదక్, రామాయంపేట, నర్సాపూర్ బల్దియాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. తూప్రాన్ బల్దియాను మాత్రం బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. రామాయంపేటలో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉండటంతో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు కాంగ్రెస్‌కు దక్కాయి.
బల్దియాలకు కొత్త పాలక వర్గాలు
మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గాలు సోమవారం కొలువు దీరాయి. ఈ మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నికను అధికారులు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో జనరల్ బాడీ సమావేశాలను నిర్వహించారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలను నిర్వహించారు. చేతులెత్తే విధానం ద్వారా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక పూర్తయ్యాక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల చైర్‌పర్సన్‌లు, వైస్ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు ఆయా పట్టణాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి, విజయోత్సవాలు చేసుకున్నారు.


