పెద్దపులి సంచారం
అప్రమత్తంగా ఉండండి: అటవీ అధికారి
నిజాంపేట(మెదక్): మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తుందని మంగళవారం అటవీ శాఖ అధికారి విద్యాసాగర్ తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట, చల్మెడ, నస్కల్, నందగోకుల్, నగరం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం అటవీ అధికారులు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రాత్రిపూట ఎవరూ పొలాల వద్దకు వెళ్లకూడదన్నారు.
కేతకిలో ఎన్నికల
పరిశీలకుల పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో పంచాయతీ ఎన్నికల పరిశీలకులు భారతి లక్‌పతి నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయ మర్యాదలు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి పూలమాల శాలువాతో సన్మానించారు.
ఫిబ్రవరి 25 నుంచి
ఇంటర్ పరీక్షలు
జిల్లా ఇంటర్మీడియెట్
విద్యాశాఖ అధికారి గోవిందర్‌రాం
న్యాల్‌కల్(జహీరాబాద్): వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున ప్రణాళిక బద్ధంగా చదువుకొని అధిక మార్కులు తెచ్చుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోవిందర్‌రాం విద్యార్థులకు సూచించారు. మండల పరిధిలోని హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. ఇంటర్ సిలబస్ దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం పునశ్చరణ తరగతులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. సమష్టిగా కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
40 వేల ఓటర్లకు ఒక డివిజన్
ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి డిమాండ్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): జీహెచ్‌ఎంసీ పరిధిలో 40వేల ఓటర్లకు ఒక డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కార్పొరేటర్లతో కలసి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన డివిజన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ల మీద ఉన్న పలు అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డివిజన్‌లను ఏప్రాతిపదికన చేశారో, ఎవరి అభిప్రాయాలను తీసుకుని ముసాయిదా విడుదల చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కనీసం క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డివిజన్‌లను ఏవిధంగా చేశారని ప్రశ్నించారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
కల్హేర్(నారాయణఖేడ్): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం సిర్గాపూర్‌లో కేజీబీవీ పాఠశాల, సుల్తానాబాద్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు సాధించాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్, లీప్ కార్యక్రమం అమలుపై చర్చించారు.
పెద్దపులి సంచారం
పెద్దపులి సంచారం
పెద్దపులి సంచారం


