‘నోట్ల’ పండగ!
● పంచాయతీ ఎన్నికల్లో మద్యం.. మనీదే ప్రభావం
● రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్న అభ్యర్థులు
● రూ.150 కోట్ల మద్యం అమ్మకాలు
● వలస ఓటర్లకు ఎన్నికల పండగ
మెదక్ అర్బన్: మెదక్ సమీపంలో ఉన్న ఒక గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి, ఇక్కడ సుమారు రూ.కోటి వరకు ఓ అభ్యర్థి ఖర్చు చేశారన్న ప్రచారం ఉంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం ఓటరును ఎంత ప్రభావితం చేస్తుందో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో డబ్బు, మద్యం బాగా పనిచేశాయి. చిన్న పంచాయతీల్లో సైతం కనీసం రూ.5 లక్షలలు, మండల కేంద్రాలు , కాస్త పెద్ద పంచాయతీల్లో సుమారు రూ.30 నుండి 50 లక్షల వరకు అభ్యర్థులు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల వేల సుమారు రూ.150 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బంగారు నగలు, ఆస్తులు అమ్ముకుంటున్నారని సమాచారం
మద్యంతో మచ్చిక..
నోటుతో ఓటు కోసం యత్నాలు
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండేళ్లుగా ఎన్నికలపై గురి పెట్టిన ఆశావహులు, ఆరు నెలల నుంచే ఎన్నికలకు సంసిద్ధమవుతూ వచ్చారు. సర్పంచ్‌పై ఆశలు పెట్టుకున్న వ్యక్తులు, అప్పటి నుండే వార్డు మెంబర్ల ప్యానెల్‌లు తయారు చేసుకున్నారు. వీరికి కొన్ని డబ్బులు ఇచ్చి, వారి వార్డుల్లో తరచుగా మందు, విందులతో పార్టీలు ఇస్తూ వారిని చేజారి పోనీయకుండా చూసుకున్నారు. వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారిలో, ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని, తరచుగా వారికి పార్టీలు ఇస్తూ వచ్చారు. ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఇందు కోసం తమకు నమ్మకస్తులైన వారి నుంచి ఆన్‌లైన్ పే మెంట్లు జరిపారు. ఏ ఊరిలో..ఏ వీధిలో చూసినా మద్యం విచ్చల విడిగా పారింది. కొత్త ఎకై ్సజ్ సంవత్సరంలో 17 రోజుల వ్యవధిలో సుమారు రూ.150 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. అడిగిందే తడవుగా అలవి కాని హామీలను గుప్పిస్తున్నారు. చిన్నశంకరంపేట, రామాయంపేట మండలంలో ఎన్‌ఆర్‌ఐలు ఎన్నికల సమరంలోకి దిగి విజయం సాఽధించారు.
‘ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు డబ్బులు లేవని, నమ్ముకున్న వారే నట్టేట ముంచుతున్నారన్న ఆవేదనతో సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్‌పల్లిలో ఈ నెల 8న ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సానుభూతి ఓట్లు మరణానంతరం అతన్ని గెలిపించాయి’
ఆస్తులు అమ్ముకుంటున్న అభ్యర్థులు
ఎన్నికల కోసం అప్పులు తెచ్చి ఖర్చు చేసిన అభ్యర్థులు ఓడిపోవడంతో బాకీలు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకునే పనిలో పడ్డారు. పాపన్నపేట మండలంలో ఓ గ్రామానికి చెందిన అభ్యర్థి భార్య మెడలోని పుస్తెల తాడు విక్రయించినట్లు తెలుస్తుంది. అలాగే మరో వ్యక్తి తనకున్న ఒక ప్లాట్‌ను అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు వ్యవసాయ భూములను అమ్ముకునే యత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ పరంగా, అధినాయకుల పరంగా కూడా అభ్యర్థులకు కొంత మేర ఆర్థిక సహాయం అందినట్లు సమాచారం.


