కాంగ్రెస్‌లో కోవర్టులు: మైనంపల్లి
రామాయంపేట/నిజాంపేట(మెదక్): కొందరు కోవర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే, మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. మంగళవారం నిజాంపేట మండలం కల్వకుంటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ఆనవాయితీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు డబ్బులమయం అయ్యాయని, ప్రచార సరళిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేత హరీశ్‌రావుకు పోలీసులు, అధికారులపై పూర్తిస్ధాయి కమాండ్ ఉందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ వారికి సమాచారం అందజేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కోవర్టు సిస్టం పోతే తాము వందశాతం గెలుస్తామని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో 75 శాతం మేర పార్టీ బలపర్చిన సర్పంచులు గెలిచారని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలను కలుషితం చేశారని, నేడు డబ్బులు లేనిదే రాజకీయాల్లో ముందుకు వెళ్లడం కష్టతరమని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు కొందరు నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇప్పటికీ హరీశ్ కమాండ్ చేస్తున్నారు
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపణ
ఎన్నికల్లో డబ్బుల పంపిణీ
ఆనవాయితీగా మారిందని ఆందోళన


