సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలు: ఎస్పీ
శివ్వంపేట(నర్సాపూర్)/నర్సాపూర్: ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 750 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం శివ్వంపేటలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేందుకు రూట్ మొబైల్ పార్టీలు, ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, డీఎస్పీల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విజయోత్సవ ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగా కృష్ణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్ రెడ్డి ఉన్నారు. కాగా, ఏఎస్పీ మహేందర్ నర్సాపూర్‌లో మాట్లాడుతూ.. జిల్లాలో 503 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశామన్నారు.


