కదలని కాళేశ్వరం కాల్వలు
● బీళ్లుగా మారిన లక్ష ఎకరాలు
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
మెదక్‌జోన్/పాపన్నపేట/నర్సాపూర్ రూరల్/నర్సాపూర్/కౌడిపల్లి/కొల్చారం: కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవటంతో లక్షన్నర ఎకరాలకు నీరందకుండా పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆమె రాత్రి మెదక్ చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవని, నిజాం పాలనలో నిర్మించిన ఘనపూర్ ఆనకట్టతోనే 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి జరగాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. మెదక్ అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, ఇక్కడ అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అంతకుముందు ఘనపురం ప్రాజెక్టు, ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గుడి మునుగొద్దు అంటే ప్రాజెక్టు ఎత్తు పెంచాలన్నారు. ప్రభుత్వం రూ. 30 కోట్లు విడుదల చేసి పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే నర్సాపూర్ మండలంలో ఓ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి ఎస్టీ గురుకుల పాఠశాలలో వి ద్యార్థులతో భోజనం చేశారు. కొల్చారం కేంద్రంగా కవి మల్లినాథసూరి పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.
బాహాటంగా మాట్లాడితే వెళ్లగొట్టారు
బాహాటంగా మాట్లాడినందుకే బీఆర్‌ఎస్ నుంచి వెళ్లగొట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో ట్రిపుల్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులతో మా ట్లాడారు. బడా నాయకుల భూములు కాపాడేందుకు అలైన్‌మెంట్ మార్చారని రైతులు పేర్కొనగా, మీ తరఫున కొట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం కాళేశ్వరం ప్యాకేజీ 17 కాల్వను సందర్శించారు. ఆమె వెంట జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి, నాయకులు శేఖర్, రాము యాదవ్, గణేష్ కుమార్, నవీన్, శ్రీనివాస్ ఉన్నారు.


