నాణ్యమైన విత్తనాలతో మంచి దిగుబడి
శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ
కొల్చారం(నర్సాపూర్): నాణ్యమైన విత్తనంతో పంటలు సంవృద్ధిగా పండించి తద్వారా దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆదిశగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి విత్తన కిట్లు అందజేసిందని జిల్లా నోడల్ అధికారి, శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ అన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టాపూర్‌లో ఎంటీయూ 1010 రకం వరిని పరిశీలించి మాట్లాడారు. నాణ్యమైన విత్తనాలను రైతులు తమ పొలాల్లో పండించి, ఇతర రైతులకు చేరవేసేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. ఇది విత్తన లభ్యతను పెంచడమే కాకుండా, నాణ్యమైన విత్తనంపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్వేతకుమారి, వ్యవసాయ విస్తరణ అధికారులు అంబిక, నిరోషా తదితరులు పాల్గొన్నారు.


