ఈసారైనా మెరుగుపడేనా?
మెదక్‌జోన్: గత రెండేళ్లుగా ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెతుకుసీమ అట్టడుగు స్థానానికే పరిమితం అయింది. విద్యార్థులను గాడిలో పెట్టి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాల్సిన అధికారులు, ఆదిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈసారైనా తగు చర్యలు తీసుకొని ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఇంటర్మీడియెట్ కళాశాలలు కలిపి మొత్తం 61 ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 7,077 మంది, సెకండియర్‌లో 6,149 కలిపి మొత్తం 13,226 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా గడిచిన కొన్నేళ్లుగా ఇంటర్మీడియెట్ ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థానానికే పరిమితం అవుతోంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 2025 ఏప్రిల్ 23న వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు 11,725 మంది పరీక్షలు రాయగా, అందులో 6,456 మంది మాత్రమే పాసయ్యారు. అంటే సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. మెదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో 33వ స్థానానికి జిల్లా పరిమితం కాగా, సెకండ్ ఇయర్‌లో 29వ స్థానంలో నిలిచింది. అలాగే 2022, 2023 ఫలితాలు నిరాశే మిగిల్చాయి. ఇదిలాఉండగా ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఇంటర్ ఫలితాల్లో జిల్లా వెరీ పూర్!
రెండేళ్లుగా అట్టడుగు స్థానానికే
పరిమితం
దారుణంగా పడిపోతున్న ఉత్తీర్ణత
ఫిబ్రవరి 25 నుంచి వార్షిక పరీక్షలు
మంచి ఫలితాలు సాధిస్తాం
ఈసారి ఇంటర్మీడియెట్‌లో మెరుగైనా ఫలితాల సాధనకు కృషి చేస్తున్నాం. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ఉండటంతో డిసెంబర్ వరకు సిలబస్ పూర్తి చేస్తాం. మిగిలిన రెండునెలల గడువులో ప్రాక్టికల్స్ నిర్వహించి, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
– మాధవి, డీఐఈఓ


