సంత.. సమస్యల చింత
రామాయంపేట(మెదక్): వారంతపు సంతలో సౌకర్యాలు కొరవడ్డాయి. దీంతో వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రామాయంపేటలో రూ. రెండున్నర కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సమీకృత మార్కెట్ భవన సముదాయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. పనులు కొనసాగుతాయా..? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కనీస సదుపాయాలు కరువు
ప్రతి బుధవారం రామాయంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఇరుకు రోడ్డుపై సంత కొనసాగుతోంది. సుమారు 30 గ్రామాల ప్రజలు, వ్యాపారులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. దీంతో సంతలో అత్యంత రద్దీ నెలకొంటుంది. రెండు కిలోమీటర్ల మేర కనీసం కాలినడకన వెళ్లడానికి సైతం వీలులేకుండా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ కొనసాగుతున్న మార్కెట్‌ను ఇప్పటికే నాలుగు స్థలాలకు మార్చారు. మొదట్లో రోడ్డుపై కొనసాగిన మార్కెట్ కేవలం కొన్ని నెలల పాటు రైతుబజార్‌లో కొనసాగింది. అక్కడ వ్యాపారం సక్రమంగా కొనసాగకపోవడంతో మిషన్ కంపౌండ్ ఆవరణలోకి మార్చారు. చర్చి ప్రతినిధుల అభ్యంతరాలతో అక్కడి నుంచి ఎత్తివేసి తాత్కాలికంగా పోలీస్‌స్టేషన్ సమీపంలో మెదక్ రోడ్డులోకి మార్చారు. ప్రస్తుతం ఇక్కడే మార్కెట్ కొనసాగుతుండగా, వ్యాపారులు, కూ రగాయల కొనుగోలు నిమిత్తం వచ్చే వారి కోసం ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. మూత్రశాలలు సైతం లేకపోవడంతో వారు ఇబ్బందులపాలవుతున్నారు. సమీకృత మార్కెట్ భవన సముదాయం నిర్మాణం పూర్తయితే ఈ ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. ఎంపీపీ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న భవన సముదాయాల నిర్మాణం పిల్లర్ల స్థాయిలో నిలిచి మూడేళ్లు అవుతోంది. అసలు పనులు కొనసాగుతాయా..? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని రద్దు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనాల నిర్మాణం చేపట్టే ఆలోచనతో యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. అలాగే కాట్రియాల గ్రామంలో ఉపాధి నిధులతో నిర్మించ తలపెట్టిన మార్కెట్ సముదాయం అసంపూర్తిగా వదిలేశారు. గోడలు నిర్మించి, రేకులు బిగించి అసంపూర్తిగా ఉంది. సుమారు రూ. పది లక్షల మేర ఖర్చుకాగా, మళ్లీ నిధులు మంజూరైతే తప్ప పనులు సాగని పరిస్థితి నెలకొంది.
రామాయంపేట సంతలో రద్దీ
నిలిచిన సమీకృత మార్కెట్ భవనాల నిర్మాణం
ఇబ్బంది పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
సంత.. సమస్యల చింత


