ఏడుపాయల ఆలయం మూసివేత
పాపన్నపేట(మెదక్): సింగూరు నీటి విడుదలతో మంజీరాకు వరదలు పోటెత్తాయి. దీంతో ఏడుపాయల ఆలయాన్ని బుధవారం మూసివేశారు. రాజగోపురంలో దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టు 14వ గేటు ఎత్తి 12,082 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. దీంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. ఆలయం ఎదుట నుంచి నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్య గా ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తడిసిన వడ్లు
కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసి వడ్లు తడుస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా మండలాల పరిధిలోని పాంబండ, ఖాజీపేట, సంగాయిపేట, రంగంపేట, చిన్న ఘనపూర్, వరిగుంతం, చిలప్‌చెడ్ తదితర గ్రామాల్లో రైతులు వరి కోతలు కోయడంతో ధాన్యం తడిసిందని తెలిపారు. కాగా అవసరం ఉన్న రైతులకు టార్పాలిన్లు అందజేయాలని కోరారు. ఇదే విషయం కలెక్టర్ రాహుల్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భోజనం ఎలా ఉంది?
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధి కోమటిపల్లి శివారులోని కేజీబీవీ పాఠశాలను బుధవారం మెదక్ ఆర్డీఓ రమాదేవి సందర్శించారు. ఇటీవల స్కూల్‌లో ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిని విద్యార్థిని ప్రియాంకను పరామర్శించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో భోజనం ఎలా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులతో పాటు జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోయిన రైతుల వివరాల గురించి తెలుసుకున్నారు. ఆమె వెంట తహసీల్దార్ రజని, ఆర్‌ఐలు, ఇతర సిబ్బంది ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
పాపన్నపేట(మెదక్): రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని బాలల హక్కుల ప్రజా వేదిక అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు, 33 రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి బాలమిత్ర అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. దేశభక్తి పాటలు, భరత నాట్యం, గిటార్, కీబోర్డు ప్లేయింగ్, యోగా, చిత్రలేఖనం, జానపద గీతాలు, తదితర అంశాల్లో నైపుణ్యం గలవారు వచ్చేనెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటి నంబర్ 2–92, గ్రామం కూరెల్ల, మండలం కోహెడ, జిల్లా సిద్దిపేట, పిన్ నంబర్ 505473కు పంపాలని కోరారు.
క్వారీ లీజులు
రెన్యువల్ చేసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని మైనింగ్, క్వారీ లీజులు రెన్యువల్, నూతన క్వారీల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్వాహకులు రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అధ్యాయన సంస్థ (సీయా) జారీ చేసే పర్యావరణం అనుమతి కూడా తీసుకోవాలన్నారు. ఇందుకోసం అత్యంత కీలకమైన జిల్లా సర్వే నివేదికను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రూపొందించినట్లు తెలిపారు.
ఏడుపాయల ఆలయం మూసివేత
ఏడుపాయల ఆలయం మూసివేత


