పొంచిన మరో ముప్పు
ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలింపు కేంద్రాలకు నామమాత్రంగా టార్పాలిన్ల సరఫరా నాలుగు రోజులుగా తడుస్తున్న వడ్లు ఆందోళన చెందుతున్న అన్నదాతలు
మొంథా హెచ్చరికలతో.. వరికోతలు వద్దంటూ అధికారుల సూచన
వరుస తుపానులతో రైతులు అతలాకుతలమవుతున్నారు. ఆగస్టులో మొదలైన వానలు అన్నదాతలను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మొంథా తుఫాన్ కారణంగా మళ్లీ భారీవర్షాలు కురుసే అవకాశాలున్నాయని, నాలుగు రోజులపాటు వరికోతలు నిలిపి వేయాలని జిల్లా యంత్రాంగం రైతులకు సూచించింది. ఇప్పటికే వరద ఉధృతితో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా తాజాగా మొంథా రూపంలో మళ్లీవానలు కురుస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. –మెదక్‌జోన్
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 3.5లక్షల ఎకరాలలో వరిపంటలను సాగు చేశారు. దీంతో 4.20 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేసిన అధికారులు 518 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తామని భావించిన అధికారులు ఇప్పటికే 513 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పదిహేను రోజులుగా ధాన్యం సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు 5,705 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కాగా ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు సిద్ధంగా ఉంది. నాలుగైదు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షం కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతోంది. తడిసిన ధాన్యాన్ని కూలీల సహకారంతో మళ్లీ, మళ్లీ ఆరబెడుతూ అదనపు భారాన్ని భరిస్తున్నారు. కాగా, తాజాగా జిల్లాకు భారీ నుంచి అతిభారీ వర్షాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికతో అధికారులు వరికోతలు నాలుగు రోజులపాటు వాయిదా వేయాలని హెచ్చరికలు జారీచేసింది.
జిల్లాలో కొన్నేళ్లుగా అకాల వర్షాల కారణంగా ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి రైతులు నరకయాతన పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు అద్దెకు టార్పాలిన్లు తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కో రైతు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం ఎప్పుడు సరిపడా టార్పాలిన్లు ఇచ్చిన దాఖలాల్లేవు. ఈసారి కేవలం 9,227 టార్పాలిన్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.
వరి కోతలు వద్దు
మొంథా తుపాను కారణంగా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 4 రోజుల పాటు వరికోతలను వాయిదా వేయాలని చెప్పాం. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
జగదీశ్‌కుమార్, డీఎం,
పౌరసరఫరాల శాఖ అధికారి


