మట్టి.. కొల్లగొట్టి
అడ్డగోలుగా తవ్వకాలు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలుస్తుండగా, పోటీ పడి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా ఇంటి నిర్మాణాలకు మట్టి అవసరం ఉండగా, అధికారుల అనుమతితో తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతూ అడ్డదారిలో రూ. కోట్లు సంపాదిస్తున్నారు.
– మెదక్‌జోన్
జిల్లా కేంద్రంలో లక్షకు చేరువలో జనాభా ఉండగా, 18 వేల నివాస గృహాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 30 శాతానికి పైగా వలస వచ్చిన ప్రజలతో పాటు ఉద్యోగులు అద్దెకు ఉంటున్నారు. దీంతో పట్టణంలో నూతనంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉంది. దీ ంతో రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున భవనాలు నిర్మిస్తున్నారు. కాగా మెదక్ పక్కనే గల చేగుంట రహదారిని ఆనుకొని పిల్లికొటాల్ శివారు, మంబోజిపల్లిని ఆనుకొని సహజ సిద్ధంగా వెలిసిన గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల నుంచి అక్రమార్కులు పగ లు, రాత్రి తేడా లేకుండా మట్టిని ఇష్టానుసారంగా తవ్వి నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో టిప్పర్‌కు రూ. 4 నుంచి రూ. 5 వేల చొప్పున తీసుకుంటున్నారు. ఒక్కో ఇంటి ని ర్మాణానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు గుంపగుత్తగా మాట్లాడుకొని టిప్పర్ల ద్వారా మట్టిని సరఫరా చేస్తున్నారు. పట్టణానికి చెందిన పలువురు మట్టి వ్యాపారులుగా అవతారమెత్తారు. నిబ ంధనల ప్రకారం ప్రభుత్వానికి చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం అధికారుల అనుమతి మేరకు మట్టిని ఎక్కడి నుంచి తరలించాలనేది నిర్ధారించుకోవాలి. కానీ జిల్లాలో అలాంటేవి జరగటం లేదు. మట్టి అవసరం వచ్చిందంటే చాలు అధికారులకు బదులు అక్రమార్కులను సంప్రదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
అనుమతి లేకుండా ఇష్టారీతిన తరలింపు
ప్రభుత్వ ఆదాయానికి గండి
చోద్యం చూస్తున్న అధికారులు
అక్కరకు రాని కుమ్మరికుంట
పిల్లికొటాల్‌ను ఆనుకొని రోడ్డు పక్కనే ఉన్న కుమ్మరికుంట నుంచి కొంతకాలంగా అక్రమార్కులు సుమారు 5 మీటర్ల లోతు వరకు మట్టిని తవ్వారు. దీంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వర్షాలకు నిండుకుండలా మారింది. అయితే ఆయకట్టు భూములు ఎత్తుగా ఉండటంతో కుంట నుంచి నీరు సాగు భూములకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా కొంతకాలంగా 50 ఎకరాలకు పైగా ఆయకట్టు భూములు బీడుగా మారింది. దీంతో చేసేది లేక రైతులు ఆ భూములను విక్రయానికి పెట్టారు. అలాగే కుంటలో ఏర్పడిన గుంతల్లో పడి ఇద్దరు పశువుల కాపరులు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటనలు ఉన్నాయి.


