వాహన బీమా.. భవితకు ధీమా
● ఆపద సమయంలో అండ
● విస్మరిస్తున్న వాహనదారులు
● జిల్లాలో 1.88 లక్షలకు పైగా వెహికిల్స్
మెదక్ మున్సిపాలిటీ: మనం ఉపయోగించే వాహనాలకు తప్పనిసరిగా బీమా చేయించాలి. కానీ ఈ విషయాన్ని చాలా మంది వివిధ కారణాలతో విస్మరిస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.88 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో సగాని కంటే ఎక్కువ వాటికి బీమా లేనట్లు అధికారులు గుర్తించారు. మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి. వాహనానికి అనుకొని ప్రమాదం జరిగితే.. బీమాతో తగిన పరిహారం పొందే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో ప్రమాదం జరిగితే డ్రైవర్‌కు లేదా ప్రయాణికులకు, ప్రమాదానికి గురైన వ్యక్తులకు నష్ట పరిహారం వర్తిస్తుంది. అయితే వాహనాన్ని బట్టి ప్రతి ఏడాది బీమా చెల్లించాలి. గతంలో లైసెన్స్ లేకపోయినా.. హెల్మెట్ లేకపోయినా జరిమానాలు విధించేవారు.. ఇప్పుడు వాహనానికి బీమా లేకుండా నడిపితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరగరాని నష్టం ఏం జరిగినా సదరు యజమానే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ఎలా నిర్ణయిస్తారు?
వాహనం చోరీకి గురైనా.. ప్రమాదంలో నుజ్జునుజ్జయినా ఐడీవీని పాలసీదారుడికి చెల్లిస్తారు. వాహన కాల పరిమితి ఆధారంగా ఈ ఐడీవీని చెల్లించాల్సి ఉంటుంది. వాహనం కొనుగోలు చేసిన నెలలోపు అయితే 5 శాతం, ఏడాదిలోపు 15 శాతం, ఏడాది తర్వాత 20 శాతం, రెండేళ్లు దాటితే 30 శాతం, మూడేళ్లు దాటితే 40 శాతం, నాలుగేళ్లకు పైబడితే 5 శాతం తరుగుదల తీసేస్తారు. వాహన ప్రమాదానికి కారణమైన పాలసీదారుడు లేదా బాధితుడు, వారి తరఫున మరొకరు ప్రమాద సమాచారాన్ని వెంటనే బీమా కంపెనీకి, పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ కింద నష్టపరిహారం పొందడానికి బాధితులు మోటార్ వాహనాలకు సంబంధించిన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. సొంత వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు వాహనాన్ని ప్రమాద స్థలంలోనే ఉంచాలి. వాహనానికి సహజంగా జరిగే నష్టానికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు.
ఇబ్బందులు తప్పవు
వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. అనుకొని ప్రమాదం జరిగినప్పుడు బీమా ఉంటే 90 శాతం ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే సర్వం కోల్పోవాల్సి వస్తుంది. వాహనదారులు నిర్లక్ష్యం వహించొద్దు. తనిఖీ సమయంలో బీమా లేని వాహనాలకు జరిమానా విధిస్తూ అవగాహన కల్పిస్తున్నాం.
– మహేందర్, అదనపు ఎస్పీ


